ప్రియురాలిని అడవిలోకి తీసుకెళ్లి.. ఫ్రెండ్స్‌తో కలిసి.. వృద్ధుడు ఈల‌తో..

త‌మిళ‌నాడులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమించ‌న‌వాడే ఆ యువ‌తిని అడ‌వికి తీసుకెళ్లి స్నేహితుల‌తో క‌లిసి అత్యాచారం చేయ‌బోయారు. ఓ వృద్దుడు ధైర్యంగా అడ్డుకోవ‌డంతో ఆ యువ‌తి పెద్ద ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది.

ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. రాణిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని (19) వేలూరులోని కాలేజీలో చ‌దువుతోంది. అదే క‌ళాశాల‌కు చెందిన ఓ విద్యార్థితో (19) ప‌రిచ‌యం అయ్యింది. క్ర‌మంగా ప్రేమ‌గా మారింది. కాగా వీరిద్దరు అప్పుడప్పుడు బయట షికార్లు కొట్టేవారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం ఆ విద్యార్థి యువతిని అమ్రితి పార్కుకు తీసుకెళ్లాడు. కొంత‌సేప‌టికి అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ యువకుడి ముగ్గురు స్నేహితులు మాటు వేశారు.

న‌లుగురు క‌లిసి యువ‌తిపై అత్యాచారానికి య‌త్నించారు. యువ‌తి కేక‌లు పెడుతూ ప‌రుగులు పెట్టింది. అక్క‌డికి స‌మీపంలోనే ఓ వృద్ధుడు క‌ట్టెలు కొడుతున్నాడు. యువ‌తి కేక‌లు విని అక్క‌డ‌కు వ‌చ్చాడు. యువ‌తి వృద్ధుడి సాయం కోర‌గా వృద్ధుడు గ‌ట్టిగా ఈల‌ను వేశాడు. వృద్ధుడు ఈల‌తో చుట్టుపక్కల కట్టెలు కొడుతున్న వారంతా చేరారు. వీరిని చూసిన ముగ్గురు స్నేహితులూ పరారుకాగా.. ప్రియుడు మాత్రం దొరికిపోయాడు.

నిందితుడిని పట్టుకుని నెత్తిమీద కట్టెల మోపు పెట్టి సమీప గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ స్థానికులందరూ కలిసి అతడికి దేహశుద్ధి చేశారు. స్థానికుల స‌మాచారంతో అక్క‌డ‌కు చేరుకున్న‌ బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులకు చెబితే, పరువు పోతుందని వారు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం విచారణ ప్రారంభించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్