న్యూ ఇయర్ లో దారుణం..చిన్నారిపై సైకో లైంగిక దాడి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రం సమీపంలో నూతన సంవత్సరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై ఒక సైకో లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిద్రలో ఉన్న చిన్నారిని సైకో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఆడపిల్లలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సీఎం జగన్ ఏపీ దిశ యాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చిన రోజే రెండు దారుణాలు వెలుగు చూశాయి. దిశ యాక్ట్ ప్రవేశపెట్టిన రోజు..ఆ శిక్షలు, సెక్షన్లు చూసి ఆడపిల్లలపై ఆగడాలు తగ్గుతాయనుకున్నారు కొందరు. తగ్గడం సంగతి అటుంచితే..అంతకన్నా దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నీమధ్య చిత్తూరులో కూడా మతిస్థిమితం లేని అమ్మాయిపై లైంగిక దాడి చేయాలని చూసిన ఓ టైలర్ ను యువతి అన్న చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఇటు తెలంగాణలో కూడా దిశ ఉదంతం తర్వాత ఆడ పిల్లలపై అఘాయిత్యాలు కాస్త తగ్గుతాయని రాష్ర్ట వ్యాప్తంగా అందరూ అనుకున్నదే. వెటర్నరీ డాక్టర్ దిశ పై అత్యాచారం తర్వాత సీపీ సజ్జనార్ నేతృత్వంలో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. నిందితుల ఎన్ కౌంటర్ పై అనుమానాలున్నాయని ఎన్ హెచ్ ఆర్సీ చెప్పడంతో…కుటుంబ సభ్యులు కూడా ఎన్ హెచ్ ఆర్సీ తెలంగాణ ప్రభుత్వం పై, పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. హై కోర్టు నుంచి ఆ ఎన్ కౌంటర్ కేసు దర్యాప్తు సుప్రీంకు చేరింది. సుప్రీం నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయాలని, ఆ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నిందితుల ఎన్ కౌంటర్ పై ఎంక్వైరీ కోసం ప్రత్యేక కమిషన్ ను కూడా వేసింది సుప్రీం. ఇంతా జరిగినా తెలంగాణ పోలీసులు చేసిందే కరెక్ట్ అంటున్నారు. ప్రజల చేత మన్ననలైతే అందుకున్నారు గాని పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ ఉండటం లేదు. దిశ ఉదంతం జరిగిన స్థలంలో సీసీ కెమెరాలు, పోలీసుల నిఘా పెంచారు గానీ..ఇలా పసిపిల్లలను ఎత్తుకెళ్లి లైంగిక వాంఛను తీర్చుకునే వారి ఆట మాత్రం కట్టించలేకపోతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.