ముఖ్యాంశాలు

  • త్వరలో ఏపీ, తెలంగాణలో
  • ఐదు రూట్లలో ప్రైవేటు రైళ్లకు అనుమతి
  • విమానాల తరహాలో సౌకర్యాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. డిమాండ్‌ ఉన్న ఐదు రూట్లలో ఏడురైళ్లను ఆపరేటర్లు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుల లబ్ది కోసమే వీటిని ప్రవేశపెడుతున్నట్లు ఇటీవలే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశ వ్యాప్తంగా వంద మార్గాల్లో 150 ప్రైవేటు ప్యాసింజర్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నీతి అయోగ్‌ సూచించడంతో ఈ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన టెండర్లను కూడా ఈనెలలోనే పిలిచేందుకు ఆయోగ్‌ పచ్చజెండా ఊపింది. కాగా, 22వేల 500 కోట్ల పెట్టుబడితో దేశంలో వంద మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌ కస్టర్‌ పరిధిలో..

వీటిలో సికింద్రాబాద్‌ కస్టర్‌ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఐదు రూట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ-లక్నో మధ్య తేజస్‌ ప్రైవేటు రైలు నడుపుతోంది. గత సంవత్సరం అక్టోబర్‌లో దీనిని ప్రారంభించారు. రెండో ప్రైవేటు ట్రైన్‌ ఆహ్మదాబాద్‌ – ముంబాయి మార్గంలో ఈనెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైళ్లలో విమానాలలో ఉండే సౌకర్యాలు ఉంటాయి. రైల్‌ హోస్టెస్‌లు ఉంటాయి. ఏపీలోని ఐదు రూట్లలో రోజు,వారాంతపులలో ఏడు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి.

డిమాండ్‌ ఉన్న ఐదు రూట్లలో..

ఇక రాష్ట్రంలో ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా  ఉన్న రూట్లనే ప్రైవేటు రైళ్లకు ఎంపిక చేశారు. శ్రీకాకుళం నుంచి అధికంగా వలస వెళ్లిన వారు ఉన్నారు. హైదరాబాద్‌, చర్లపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. తిరుపతి, గుంటూరు, లింగంపల్లి ప్రాంతాల నుంచి ప్రయాణికుల డిమాం ఎక్కువగా ఉంటోంది. ఇక విశాఖపట్టణం – విజయవాడ, తిరుపతి- విశాఖ రూట్లలో అదే పరిస్థితి ఉంది. ఈ మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేటు ట్రైన్లు నడిచే ఐదు మార్గాలివే..

గుంటూరు – లింగంపల్లి

విజయవాడ – విశాఖపట్టణం

చర్లపల్లి – శ్రీకాకుళం

లింగంపల్లి – తిరుపతి

విశాఖపట్టణం – తిరుపతి

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.