పెళ్లైన 10రోజులకే భర్తను అరెస్ట్‌ చేయించిన పూనమ్‌ పాండే.. కారణమేంటంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2020 8:13 AM GMT
పెళ్లైన 10రోజులకే భర్తను అరెస్ట్‌ చేయించిన పూనమ్‌ పాండే.. కారణమేంటంటే..?

సినిమాల కన్నా తన బోల్డ్‌నెస్, ఇతరత్రా విషయాలతోనే వార్తల్లోకెక్కే నటి పూనమ్ పాండే. ఇటీవలే పెళ్లి చేసుకున్న పూనమ్‌ పాండే.. 3 వారాలు తిరక్కముందే భర్త పై కేసు పెట్టింది. భర్త సామ్ బాంబే తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. దాడిచేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ గోవా పోలీసులను ఆశ్రయించింది. బాలీవుడ్ పూనమ్ పాండే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆమె భర్త సామ్ బాంబేను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తను జైల్లో పెట్టించడం ఇప్పుడు చర్చగా మారింది.

పూనమ్‌పాండే, సామ్ బాంబే చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. సెప్టెంబర్‌ 10న ఇద్దరూ వివాహాం చేసుకున్నారు. . పెళ్లిలోనూ ఈ జంట తమ ప్రేమను చూపించారు. మనచుట్టూ ఎవరూ లేరు అన్నంత సాన్నిహిత్యంగా ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. సినిమా షూటింగ్ కోసం దక్షిణగోవాలోని కనాకోనాకు పూనమ్ వెళ్లగా భర్త సామ్ బాంబే సైతం ఆమె వెంట ఉన్నారు.

వారి కాపురం హ్యాపీగా సాగుతుందున్న క్రమంలో ఏకంగా భర్తపైనే లైంగికంగా వేధించారంటూ అరెస్ట్ చేయించడం సంచలనం రేపింది. పూనమ్ పాండే పీఎస్‌కు వచ్చి భర్తపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం బెదిరింపులు ఆరోపణలు చేస్తూ సోమవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేసిందని ఇన్‌స్పెక్టర్ తుకారం చవాన్ తెలిపారు. పూనమ్ పాండే ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామ్‌ బాంబేను గోవా పోలీసులు సెప్టెంబర్ 22న అరెస్ట్‌ చేశారు. పూనమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

నా భర్త నాపై అత్యాచారం జరపబోయాడు. నా ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. నేను అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాడి చేశాడు. లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బయటపెడితే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోనాల్సి వస్తుందని బెదిరించాడని పూనమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లవ్ మ్యారేజీ చేసుకున్న జంట 3 వారాల్లోనే గొడవ ఎలా మొదలైంది, అసలేం జరిగింది అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ చెబుతున్నారు.

Next Story