ప్రజల మాన, ప్రాణాలు కాపాడాల్పింది పోలీసులే. అలాంటి రక్షక భుటులే భక్షించిన ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఇద్దరు పోలీసులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ ఇద్దరిని సస్పెండ్‌ చేశారు.

పర్యాటక ప్రాంతం అయిన పుదుచ్చేరికి వీకెండ్‌లో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఎక్కువ ప్రేమ జంటలే అక్కడకు వస్తుంటారు. శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు అక్కడున్న ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత అక్కడే గదులు అద్దెకు తీసుకొని బస చేశారు. గస్తీ విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ప్రేమికులు బస చేసిన గదులకు వెళ్లారు. సతీష్‌ కుమార్, సురేష్‌ అనే ఇద్దరు పోలీసులు ప్రేమ జంటలు ఉన్న గదులు తలుపు తట్టారు. ఓ ప్రేమ జంట తలుపు తట్టి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని బెదిరించగా.. భయపడిన ఆప్రేమ జంట వారికి రూ. 20 వేలు ఇచ్చి సర్దుబాటు చేసుకుంది.

ఆ తర్వాత మరో ప్రేమజంట వద్దకు వెళ్లగా వారి వద్ద తగిన డబ్బు లేకపోవడంతో ప్రియుని కళ్లెదుటే అతని ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. జరిగిన సంఘటనను బయటకు చెబితే పరువు పోతుందని భావించిన ఆ జంట పుదుచ్చేరి వదిలివెళ్లిపోయారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. అత్యాచారం, మామూళ్ల వసూళ్ల సంఘటనలు నిర్ధారణ కావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు సతీష్‌ కుమార్, సురేష్‌లను సస్పెండ్‌ చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.