డబ్బులిస్తానని చెప్పి ఆటో ఎక్కించుకుని…

ముఖ్యాంశాలు

  • ఒంగోలు అత్యాచారం కేసులో వెలుగు చూసిన కొత్త విషయాలు

ఈ నెల 21వ తేదీ రాత్రి ఒంగోలు చినమల్లేశ్వర కాలనీ శివారు ప్రాంతంలో మహిళ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త విషయాలు బయటికొచ్చాయి. రోడ్డు వెంట నడిచి వెళ్తున్న మహిళను ఆటోలో వెళ్తున్న వ్యక్తులు తమ ఆటోలో ఎక్కించుకున్నారు. అప్పటికే కేశరాజుకుంటకు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. ఆటోలోనే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగకుండా పలుమార్లు ఆమెపై అత్యాచారం చేయడంతో ఆ మహిళ పూర్తిగా స్పృహ కోల్పోయిన స్థితికి చేరుకుంది. ఆ మహిళ స్పృహకోల్పోయి ఉందని తెలిసి నిర్దయగా, మానవత్వం మరిచిపోయి ఆటోలోంచి మహిళను బయటకు లాగి అక్కడే పడేసి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి ఒక ఆటో డ్రైవర్ చీమకుర్తికి చెందిన వ్యక్తిని తన ఆటోలో ఎక్కించుకుని కేశరాజుకుంట వైపుకు బయల్దేరాడు. ఆటోలో ఎక్కిన వ్యక్తి నుంచి సొత్తును కాజేయాలని వ్యూహం పన్నిన డ్రైవర్..పాత మార్కెట్ సెంటర్ కు చెందిన తన మిత్రుడికి ఫోన్ చేసి సిద్ధంగా ఉండాలని సూచించాడు. దారి మధ్యలో తనకు పాత పరిచయం ఉన్న మహిళతో మాట్లాడి..ఆటో ఎక్కాలని, నగదు ఇస్తానని చెప్పి ఎక్కించుకున్నాడు. ముందుగా మాట్లాడిన తన మిత్రుడిని కూడా ఆటోలో ఎక్కించుకున్నాడు. అంతా కలిసి చినమల్లేశ్వర కాలనీ శివారుకు చేరుకుని మద్యం సేవించారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు మిత్రులతో పాటు ప్రయాణికుడు కూడా ఆటోలోనే మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది.

అరవకుండా మహిళ నోటిలో బియ్యం కుక్కి…

ఈ క్రమంలోనే మహిళకు వారికి మధ్య వాగ్వాదం జరగడంతో మద్యం మత్తులో ఉన్న వారంతా ఆమె ఛాతీపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను వదిలించుకోవాలని భావించిన వారంతా..వివస్ర్తగానే ఆమెను అక్కడ వదిలి వెళ్లారు. ఆటోలోంచి ఆమెను బయటికి లాగి పడేసిన క్రమంలో మహిళ తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. ఆ తర్వాత ఆమె మొబైల్ లో ఉన్న సిమ్ కార్డును తీసి పారేసి, అందులో వారికి సంబంధించిన సిమ్ వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయితే పోలీసులు ఇంకా నిందితులను పట్టుకోలేదు. ట్రైనీ ఐపీఎస్ అధికారి జగధీష్, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్ వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఒంగోల్ తాలూకా, గ్రామీణ సీఐలు ఎం.లక్ష్మణ్, పి.సుబ్బారావు మూడ్రోజుల నుంచి ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఫోన్ డేటా, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పటికే…పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మహిళ కాల్ డేటా ఆధారంగా.. ఘటన జరగడానికి ముందు ఆమెతో మాట్లాడిన వ్యక్తులందరినీ విచారణ చేస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.