కొడుకు భార్యపై కన్నేశాడో తండ్రి. కొడుకు లేనప్పుడు ఇంట్లోకి వచ్చి కోడలితో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేదించాడు. ఈ విషయం కొడుకు తెలియకుండా ఇద్దరం సుఖం అనుభవిద్దామని చెప్పాడు. మామ చేష్టలు భరించలేని ఆ కోడలు అసలు విషయం భర్తకి చెప్పింది. తండ్రి చేసిన పనిని తట్టుకోలేని ఆ కొడుకు తండ్రిని హతమార్చాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.

యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన పిర్ల తమ్మారావు(55), దండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా.. తమ్మారావు తనకు ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇద్దరు కుమారులకి వివాహాలు అయ్యాయి. చిన్న కుమారుడు తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడిగా ఉంటుండగా.. పెద్ద కుమారుడు ఆదినారాయణ ఆ ఇంటిలోనే ఓ పోర్షన్‌లో విడిగా ఉంటున్నాడు.

ఇదిలా ఉండగా.. తమ్మారావు కన్ను పెద్ద కోడలిపై పడింది. ఈ నెల 13న పెద్ద కుమారుడు ఇంటిలో లేని సమయంలో తమ్మారావు పెద్ద కోడలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలని, కొడుక్కి తెలియకుండా తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఆమెను బలవంతం చేయబోయాడు. ఎలాగోలా మామ భారి నుంచి తప్పించుకున్నా ఆమె జరిగిన విషయాన్ని రాత్రి భర్తకు చెప్పింది. దీంతో.. తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తమ్మారావు శనివారం రాత్రి నుంచి ఇంటికి రాకుండా పొలం వద్దే ఉంటున్నాడు.

తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు తండ్రిపై కక్ష పెంచుకున్నాడు ఆదినారాయణ. ఆదివారం రాత్రి పొలం వద్ద నిద్రపోతున్న తండ్రి తమ్మారావు తలపై బలంగా కొట్టి హత్య చేసి పరారయ్యాడు. సోమవారం ఉదయం పొలానికి చేరుకున్న భార్య దండమ్మ మంచంపై విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి రోదించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ ఇన్‌ఛార్జి డీఎస్పీ భీమారావు, పిఠాపురం సీఐ సూర్య అప్పారావు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులు, మృతుడి భార్యను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. పెద్ద కుమారుడే తన భర్తను హత్య చేశాడని దండమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.