కూతురిని కిడ్నాప్‌ చేసి.. 20 ఏళ్లుగా కాపురం.. తొమ్మిది సార్లు గర్భం

తల్లితో రాసలీలలు సాగిస్తూనే.. ఆమె కూతురిపై కన్నేశాడు. ఆమెను కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా ఆమెతో కాపురం చేశాడు. ఫలితంగా ఆ అభాగ్యురాలు 9 మంది పిల్లలకు తల్లైంది. 12ఏళ్ల కూతురిని కిడ్నాప్‌ చేసి ఉరూరా తిప్పుతూ.. ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు. ఇలా 20ఏళ్ల పాటు ఆమెకు నరకం చూపాడు. కాగా.. ఎలాగోలా ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు ఆ దుర్మార్గుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ఈ హృదయ విదారకర సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రానికి చెందిన హెన్రీ మైకేల్ పిప్పీ(65) అనే వ్యక్తి ప్రియురాలితో సహజీవనం చేసేవాడు. తల్లితో రాసలీలలు కొనసాగిస్తూనే ఆమె కూతురు రొసాలిన్ మెక్‌గిన్నిస్‌పై కన్నేశాడు. ఆమెకు పన్నెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు (1997లో) కిడ్నాప్ చేశాడు. ఎవ్వరికి తెలియకుండా ఆమెను నిర్భందించాడు. మూడేళ్ల అనంతరం (2000 సంవత్సరంలో) పదిహేనేళ్ల వయస్సులో ఆమెపై తొలిసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆమెకు రోజూ నరకం చూపేవాడు. ఓ గదిలో నిర్భందించి.. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు.

ఆమెను జనం గుర్తు పట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఆమె పేర్లు మార్చి ఊరూరా తిప్పుతూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లే సమయంలో ఆమె హెయిర్‌ స్టైల్‌ను మార్చేసేవాడు. బట్టలు.. చివరికి కళ్లద్దాలు కూడా మార్చేసి ఆమె తన గర్ల్‌ ఫ్రెండ్ కూతురని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడేవాడు. అలా ఆమెను ఓక్లహామా, మెక్సికోలోని పలు ప్రాంతాల్లో ఉంచి ఆమెతో సంబంధం కొనసాగించాడు. సవతి తండ్రి కారణంగా ఆమె 9 మంది పిల్లలకు తల్లైంది.

20 ఏళ్లు మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలను అనుభవించిన రొసాలిన్‌.. ఓ రోజు(2016లో) అతని చెర నుంచి తప్పించుకుని మెక్సికోలోని యూఎస్ కాన్సుల‌్‌ అధికారికి ఫిర్యాదు చేసింది. సవతి తండ్రి అఘాయిత్యాలను వివరించింది. తనను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి తొమ్మిది మంది పిల్లలకు తల్లిని చేశాడని వాపోయింది. దీంతో.. సవతి తండ్రి మైకేల్‌పై కేసు నమోదైంది.

కూతురిని ఎత్తుకెళ్లి ఇరవై ఏళ్లుగా అత్యాచారం చేయడం.. తొమ్మిది మంది పిల్లలకు తల్లిని చేయడాన్ని న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. తీవ్రమైన నేరంగా పరిగణించి జీవిత ఖైదు, భారీగా జరిమానా విధించింది. నిందితుడికి 55 వేల డాలర్ల జరిమానా విధించడంతోపాటు బాధితురాలికి 50 వేల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్