కృష్ణా జిల్లాలో రెండు రోజుల క్రితం యువ‌కుడు అనుమానాస్పద మృతి కేసును చేధించారు పోలీసులు. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీనే యువ‌కుడి హ‌త్య‌కు కార‌ణంగా తేల్చారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన దైదా రామకృష్ణ ఈనెల 23న అర్ధరాత్రి ఖమ్మం జిల్లా బీరాపల్లి వెళ్లే రహదారిలోని ఎన్‌ఎస్పీ కాలువ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతదేహాంగా క‌నిపించాడు. అత‌డి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు మృతుడి కాల్‌డేటా ఆధారంగా కేసును చేధించారు. విస్సన్నపేట మండలం పుట్రేల శివారు వీరరాఘవాపురం గ్రామానికి చెందిన కారుమంచి విజయరావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

పెయింటర్‌గా పనిచేసే విజయరావుకు తిరు మండరువూలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది క్ర‌మేపీ ప్రేమ‌గా మారింది. ఆమెతో సన్నిహితంగా ఉండేవారు. అదే యువతిని రామకృష్ణ అనే తన స్నేహితుడు కూడా ప్రేమిస్తున్నాడని విజయరావు తెలుసుకున్నాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నాడన్న కోపంతో రామకృష్ణను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.

అనుకున్న‌దే త‌డ‌వుగ‌డా.. ప్లాన్ ప్ర‌కారం రెండు రోజుల క్రితం మ‌ద్యం తాగుదామ‌ని చెప్పి రామ‌కృష్ణ‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు విజ‌య‌రావు. ఇద్ద‌రూ బైక్ పై ఖ‌మ్మం జిల్లా వేంసూరు మండ‌లం బీరాప‌ల్లి వెళ్లి మ‌ద్యం తెచ్చుకున్నారు. అనంతరం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలోని ఎన్‌ఎస్పీ కాలువ కట్టపై కలిసి మద్యం తాగారు. అనంతరం విజయరావు ముందుగా సిద్ధం చేసుకున్న మంచం పట్టెతో రామకృష్ణ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం విజయరావు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.