వారిద్దరిది చూడచక్కనైన జంట. చాలా అన్యోన్యంగా సాగిపోతోంది వారి కాపురం. ఇద్దరు ఆడపిల్లలు. అయినా ఎలాంటి గొడవ లేదు. 17 ఏళ్లపాటు ఆనందంగా సాగిపోయిన వారికాపురంలో అనుమానం చిచ్చురేపింది. ఫలితంగా ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త జైలుపాలయ్యాడు. పిల్లలిద్దరూ రోడ్డున పడ్డారు. వివరాల్లోకి వెళ్తే…మైసూరు సమీపంలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా అంకహళ్లిచెందిన సురేశ్ కు, పడగూరు గ్రామానికి చెందిన శశికళకు 17 ఏళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. అప్పటి వరకూ ఎలాంటి కలహం లేకుండా సజావుగా సాగిన కాపురంలో అనుమానం ఎంటర్ అయింది. సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగి వచ్చి భార్యపై అనుమానంతో తీవ్రంగా గొడవపడేవాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె అక్కడ ఉండటం మంచిది కాదనుకుని ఆమెను తాతయ్య ఇంటికి పంపించారు. చిన్నకుమార్తె వారితోనే ఉంటుంది. కాగా…జనవరి 25 శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికెళ్లి సురేశ్ రోజూలాగానే భార్యతో గొడవపడ్డాడు. ఆ గొడవ పెద్దది కావడంతో ఓపిక పట్టలేని సురేష్ ఆగ్రహంతో భార్య తలపై కట్టెతో బాదాడు. దీంతో ఆమెకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సురేశ్ ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

తల్లి చనిపోయింది. తండ్రి జైలుకెళ్లడంతో ఆ ఇద్దరు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. సురేశ్ తనకున్న 14 ఎకరాల ఆస్తిని ఇద్దరు అక్కల పేరిట రాసిచ్చేశాడు. ఆడపిల్లలకు ఆస్తి రాసిస్తే గానీ…శశికళకు అంత్యక్రియలు చేసేది లేదని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో…సురేశ్ ఇద్దరు అక్కలు ఆస్తి ఆడపిల్లలకే రాసిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత శశికళకు అంత్యక్రియలు నిర్వహించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.