విశాఖే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ : ఎంపీ విజయసాయి

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందని బల్లగుద్దినట్లు చెప్పారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…రాజధానిని తరలించే విషయంలో సీఎం జగన్ కు ఎన్ని చిక్కులు ఎదురైనా వాటన్నింటినీ ఆయన అధిగమించి తీరుతారని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డం వచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని విజయసాయి స్పష్టం చేశారు. అలాగే ౩ రాజధానులకు బీజేపీ అనుకూలమో..లేక వ్యతిరేకమో అర్థం కావడం లేదు కానీ…కొందరు నేతలు అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించవంటూ విజయసాయి జోస్యం చెప్పారు.

మూడు రాజధానులు, మండలి రద్దు ప్రతిపాదనలు కేంద్రం వద్దనున్నాయని, కేంద్రం కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే స్పందిస్తుందని ధీమాగా చెప్పారు. అలాగే మండలి రద్దు విషయం పై కూడా త్వరలోనే స్పష్టమైన ప్రకటన వస్తుందన్నారు. హై కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు ఇస్తుందని విజయసాయి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే చంద్రబాబుకెందుకు అంత బాధ అని విజయసాయి ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో తమకున్న భూముల రేట్లు తగ్గిపోతాయన్న కారణంగానే సుజనా, చంద్రబాబు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.