అత‌ను న‌లుగురు పిల్ల‌ల తండ్రి. ఓ మైన‌ర్ అమ్మాయి పై క‌న్నేశాడు. ఆమెకు మాయ మాట‌లు చెప్పి త‌న ముగ్గులో దించాడు. ఓ రోజు ప్రియురాలిని అర్థ‌రాత్రి ఆమె ఇంట్లోనే ర‌హ‌స్యంగా క‌లిశాడు. ఆమె కుటుంబ స‌భ్యులు వీరి బాగోతాన్ని చూడ‌డంతో క‌థ అడ్డం తిరిగింది. చివ‌రికి ఇద్ద‌రూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది.

ల‌క్నో న‌గ‌రంలోని సాద‌ర్‌గంజ్ ప‌రిధి నౌబ‌స్తాలో అబ్దుల్ కరీమ్(25) అనే యువ‌కుడు నివ‌సిస్తున్నాడు. అత‌ని పెళ్లై న‌లుగురు పిల్ల‌లున్నారు. కొంత‌కాలంగా అత‌ను ఓ మైనర్ బాలిక‌(17)తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపిస్తున్నాడు. ఓ రోజు అర్థ‌రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. కూతురితో రహస్యంగా మాట్లాడుతున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడు కరీంని పట్టుకుని మూకుమ్మడి దాడి చేశారు.

బాలిక తండ్రి ఉస్మాన్, అన్న డానిష్, బాబాయ్ సులేమాన్, అతని కొడుకు రాణు కర్రలతో కొట్టారు. లాఠీలతో ప్రియుడిని చావబాదుతుంటే ప్రియురాలు అడ్డు వెళ్లింది. ప్రియుడిని కొట్టొద్దంటూ అడ్డుపడిన కూతురిని కూడా విచక్షణా రహితంగా కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని న‌లుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ అదే ప్రాంతానికి చెందిన వారని.. ఇరుకుటుంబాలు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.