కరోనా భయం: దగ్గినందుకే తుపాకీతో కాల్చేశాడు

By సుభాష్  Published on  15 April 2020 4:43 PM GMT
కరోనా భయం: దగ్గినందుకే తుపాకీతో కాల్చేశాడు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలో ఏ చిన్న ఫీవర్‌ వచ్చినా, దగ్గినా, తుమ్మినా కరోనా కాకపోయినా కరోనా వైరస్‌ అనుకుని భయపడిపోతున్నారు. కనీసం జ్వరం వచ్చినా ఆ వ్యక్తిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. దగ్గినా కూడా కరోనా ఉందని భయపడిపోతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దగ్గినందుకు ఓ దుండగుడు తుపాకీతో దారుణంగా కాల్చి చంపేశాడు. గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దయానగర్‌కు చెందిన ప్రశాంత్‌ సింగ్‌ (25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ టెంపుల్‌ వద్ద మిత్రులతో కలిసి ఫోన్‌లో గేమ్‌ ఆడుతున్నాడు. దీంతో ప్రశాంత్‌ సింగ్‌ దగ్గాడు. దీంతో అక్కడే ఉన్న జైవీర్‌సింగ్‌ అనే వ్యక్తి దాడికి దిగాడు. ఇరువురి మధ్య మాటమాట పెరగడంతో జైవీర్‌సింగ్‌ జేబులోంచి తుపాకీ తీసి ప్రశాంత్‌పై కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతనం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్‌ను తోటి మిత్రులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రశాంత్‌ దగ్గడంతో అతనికి కరోనా వైరస్‌ ఉందనే అనుమానంతో జైవీర్‌సింగ్‌ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని త్వరలోనే పట్టుకుంటామమని పోలీసులు తెలిపారు.

Next Story
Share it