హైదరాబాద్‌లో కొత్త రకం మోసం.. ఫోన్‌ ఎత్తారంటే మీ పని ఖతం..!

ముఖ్యాంశాలు

► ఆంటీలను సుఖపెట్టే ఉద్యోగం ఇప్పిస్తామని మోసాలు

► లక్షల్లో టోకరా వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

► అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

► రూ. 3లక్షలకు పైగా పోగొట్టుకున్న వ్యాపారి

హైదరాబాద్‌లో రకరకాలుగా మోసగాళ్లు తయారయ్యారు. మోసాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నిచర్యలు చేపట్టినా ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మోసగాళ్లకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. నగరంలో ప్రముఖుల భార్యలకు సుఖపెట్టేందుకు మగ వ్యభిచారులు కావాలని, దీని ద్వారా నెలకు లక్షల్లో సంపాదించుకోవచ్చంటూ ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో మోసగాళ్లు తెగరెచ్చిపోతున్నారు. ఆంటీలను సుఖపెడుతూ లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంటుందని సైబర్‌ నేరగాళ్లు నిరుద్యోగులతో పాటు వ్యాపారులను సైతం మోసం చేస్తున్నారు. అలాగే  ఉద్యోగం ఇస్తామంటూ బంపరాఫర్‌ ఇవ్వడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి సైబర్‌ వలలో చిక్కుకుని సుమారు 3 లక్షల వరకు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. చివరికి నేరగాళ్ల చేతిలో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాదు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆడిగినందుకు సైబర్‌ నేరగాళ్లు బెదిరించారని బాధితుడు సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మేల్ ఎస్కార్ట్స్ ఉద్యోగమంటూ ఫోన్‌ కాల్‌

హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ పరిధిలో కార్వాన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి గత శనివారం ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. అతనితో ఓ గుర్తు తెలియని మహిళ మాట్లాడింది. ‘ఆలిండియా ఎస్కార్ట్స్ సర్వీసెస్‌’ నుంచి మాట్లాడుతున్నామని, మీకు ఓ ఆఫర్‌ ఇస్తున్నామని చెప్పింది. తమ వద్ద రూ.1070తో మెంబర్‌ షిప్‌ తీసుకుంటే మేల్‌ ఎస్కార్ట్స్‌ గా అవకాశం కల్పిస్తామని, అంతేకాదు అంటీలను సుఖ పెడుతూ నెలకు రూ.30వేల వరకు సంపాదించుకోవచ్చని నమ్మబలికింది. సదరు మహిళ మాటలను నమ్మి ఎగిరి గంతేసిన వ్యాపారి మహిళ చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేశాడు.

ఆదివారం మరో ఫోన్‌ వచ్చింది. ఎస్కార్ట్స్‌ సంస్థ గుర్తింపు కార్డు ఇచ్చేందుకు మరో రూ.18,700 ఖాతాలో డిపాజిట్‌ చేయాలని కోరగా, అతనికి అనుమానం వచ్చి ప్రశ్నించడంతో, తాము రూ.700 మాత్రమే తీసుకుంటామని, మిగిలిన మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని చెప్పడంతో వ్యాపారి ఆ డబ్బులను కూడా ఖాతాలో వేసేశాడు. తర్వాత ఆధార్‌కార్డుకు సంబంధించిన డాక్యుమెంట్లు పంపించాలని కోరగా, వెంటనే వాట్సాప్‌ కూడా చేసేశాడు.

మరో కొత్త నాటకం

ఆ తర్వాత సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త నాటకానికి తెరలేపారు. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ వయసు 38 ఏళ్లు కాగా, ఆధార్‌ ప్రకారం 39 ఏళ్లుగా ఉందని, అందువల్ల ఐటీ కార్డు తయారు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. అందువల్ల మరో సారి రూ. 18,700 ట్రాన్స్‌ ఫర్‌ చేయాలని కోరారు.

మరోసారి రూ.43,500 డిపాజిట్‌ చేయాలని..

ఇక మరోసారి సదరు వ్యాపారికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. తమ సంస్థతో లీగల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాలని, అందుకు రూ. 43,500 డిపాజిట్‌ చేయాలని చెప్పి డబ్బులు నొక్కేశారు. ఇక చివరగా మేల్‌ ఎస్కార్ట్స్‌ పోస్టుకు పోలీస్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని, అందు కోసం రూ.75వేలు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపారికి అనుమానం వచ్చి మొత్తాన్ని డిపాజిట్‌ చేయకపోయేసరికి మళ్లీ ఫోన్‌ చేసి మీ ఏరియా పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తామంటూ బెదిరించారు. ఇలా రెండు రోజుల్లోనే సదరు వ్యాపారి నుంచి ఏకంగా రూ. 3,06,970 నొక్కేశారు.

పోలీసులను ఆశ్రయించిన వ్యాపారి

ఏ మాత్రం వెనుకాడకుండా డబ్బు మొత్తాన్ని పొగొట్టుకున్న వ్యాపారి .. మోసపోయానని తెలుసుకుని డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయి అతడి నుంచి మరింత డబ్బు లాగేందుకు ప్రయత్నించారు. వేధింపులకు విసిగిపోయిన వ్యాపారి సోమవారం హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై సైబర్‌ క్రైమ్‌ ఇన్స్‌ పెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. బాధితుడికి వచ్చిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సైబర్‌ నేరగాళ్ల వివరాలు ఆరా తీస్తున్నారు.

ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ పై అప్రమత్తంగా ఉండాలి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

ఇటీవల కాలంలో ఇలాంటి నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఫోన్ కాల్స్‌ వస్తే స్పందించకూడదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటివి హైదరాబాద్‌లో ఎన్నో జరిగాయని, బాధితుల ఫిర్యాదు మేరకు ఇలాంటి సైబర్‌ ముఠాలను పట్టుకున్నామని,  ఉద్యోగాల పేరుతో ఫోన్‌ కాల్స్‌ వస్తే స్పందించకూడదని సూచిస్తున్నారు. వారి మాయమాటల వల్ల చాలా మంది మోసపోతున్నారని అన్నారు. ఇలాంటి నేరాలపై తాము నిఘా ఉంచామని, ఫోన్‌కాల్స్‌ పై స్పందించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *