క‌రోనా వైర‌స్ అరిక‌ట్ట‌డానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో నేరాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని భావిస్తున్న త‌రుణంలో చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో శ‌నివారం రాత్రి వెలుగు చూసిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ప్రియుడి కోసం భర్త‌ను ఓ భార్య హ‌త్య చేయించింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పెద్దమండ్యం మండలం సిద్ద‌వ‌రం పంచాయ‌తీ చెరువుముంద‌ర‌ప‌ల్లెకు చెందిన బాల‌సుబ్ర‌హ్మ‌ణం(35) నీరుగ‌ట్టువారిప‌ల్లెకు చెందిన రేణుక‌ను 11 సంవ‌త్స‌రాల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. మ‌ద‌న‌ప‌ల్లెలోని క‌దిరి రోడ్డులో గిఫ్ట్ సెంట‌ర్‌ను నిర్వ‌హించేవాడు. వ్యాపారంలో న‌ష్టం రావ‌డంతో రెండేళ్ల క్రితం తిరుప‌తి వెళ్లి అక్క‌డ ట్రావెల్స్ వ్యాపారం నిర్వ‌హిస్తున్నాడు. కాగా పిల్ల‌ల‌తో క‌లిసి రేణుక మ‌ద‌న‌ప‌ల్లెలో ఉంటుంది. ఈ క్ర‌మంలో.. ఓ పార్టీకి చెందిన సేవాద‌ళం కార్య‌ద‌ర్శి కె.నాగిరెడ్డితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. ఇటీవ‌ల బాల‌సుబ్ర‌హ్మ‌ణం తిరిగి మ‌ద‌న‌ప‌ల్లెకు వ‌చ్చి ఇక్క‌డే ఉంటున్నాడు. త‌న భార్య నాగిరెడ్డితో స‌న్నిహితంగా ఉండ‌టాన్ని గ‌మ‌నించాడు. భార్య‌ను మంద‌లించాడు. ఈ విష‌యమై ప‌లు మార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి.

దీంతో ఎలాగైనా భ‌ర్త‌ను వ‌దిలించుకోవాల‌ని భావించింది. ఇదే విష‌యాన్ని ప్రియుడు నాగిరెడ్డితో చెప్పింది. శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యానికి జలుబు చేయడంతో మందులు తెచ్చుకోవాలంటూ రాత్రి 11 గంటల సమయంలో ఒత్తిడి చేసింది. అతడు బయటకు వెళ్లగానే విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. సమయం కోసం వేచి చూస్తున్న నాగిరెడ్డి మందులు తీసుకుని వస్తుండగా లారీతో ఢీకొట్టి హత్య చేశాడు. బాలసుబ్రహ్మణ్యం సోదరుడు, న్యాయవాది అయిన కె.రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేప్టటిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.