టీడీపీకి కేఈ ప్రభాకర్‌ రాజీనామా.. అదేబాటలో మరికొందరు సీనియర్లు

By Newsmeter.Network  Published on  13 March 2020 8:39 AM GMT
టీడీపీకి కేఈ ప్రభాకర్‌ రాజీనామా.. అదేబాటలో మరికొందరు సీనియర్లు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కుదేలవుతుంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ఆపరేషన్‌ ఆకర్స్‌ విజయవంతంగా దూసుకెళ్తుంది. వైసీపీ ఆపరేషన్‌ ఆకర్స్ నుంచి తమ నేతలను కాపాడుకొనేందుకు చద్రబాబు, ఆ పార్టీ ముఖ్యనేతలు తంటాలు పడుతున్నారు. రాత్రికి రాత్రే మంతనాలు జరిపి.. తెల్లారే సరికి నేతలు పార్టీ మారుతుండటంతో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఊంటూ.. టీడీపీకి కరుడుగట్టిన నేతలుగా పేరున్న నేతలుసైతం పార్టీ వీడుతుండటం ఆపార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తుంది.కరణం బలరాం లాంటి నేతలుసైతం జగన్మోహన్‌రెడ్డికి జై కొట్టారు. బలరాం వైసీపీలో చేరికకు దూరంగా ఉన్నా.. ఆయన కుమారుడికి జగన్‌ సమక్షంలో వైసీపీ కండువాకప్పించారు.

ఇదే బాటలో కర్నూల్‌ టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌సైతం టీడీపీ రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం ఆయన అనుచరులతో సమావేశమైన ప్రభాకర్‌.. అనంతరమే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీకి మనుగడ లేదని, కనీసం నేను అడిగిన కార్పొరేటర్‌కు టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో టీడీపీ ఉందని ఆరోపించారు. ఓ బీజేపీ నాయకుడి మాట టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నాడని ఆరోపించారు. త్వరలోనే ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని కేఈ ప్రభాకర్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతుంది. ప్రభాకర్‌ పార్టీ వీడటంపై మాజీ డిప్యూటీ స్పీకర్‌ కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ప్రభాకర్‌ వైసీపీలో చేరిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయన వల్ల టీడీపీ వచ్చే నష్టం లేదని స్పష్టం చేశారు.

సిద్ధా కూడా పార్టీ వీడుతున్నారా?

ప్రకాశం జిల్లాలో ఇప్పటికే కరణం బలరాం పార్టీని వీడటంతో ఆ జిల్లాలోని టీడీపీ శ్రేణుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో ఆ జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి, చంద్రబాబు స్నేహితుడు సిద్ధా రాఘవరావు సైతం టీడీపీని వీడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శిద్దాను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నేత బలరాం. తన రాజకీయ గురువు అడుగు జాడల్లో మాజీ మంత్రి సిద్ధా నడుస్తారనే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే సిద్ధాతో వైసీపీ సీనియర్‌ నేతలు చర్చలుసైతం జరిపినట్లు ప్రచారం సాగుతుంది. వైసీపీ పెద్దల నుంచి తాను కోరుకుంటున్న హామీలు లభిస్తే.. వైసీపీలో చేరేందుకు సమ్మతమేనని సిద్ధా ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా సిద్ధా రాఘవరావు తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.

సిద్ధాతో పాటు మరికొందరు టీడీపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ఏపీలో విస్తృత ప్రచారం సాగుతుంది. వైసీపీలోకి వెళ్లే వారిలో మాజీ మంత్రి శమంతకమణి, మాజీ విప్‌ యామిని బాలలు కూడా ఉన్నారని, వీరు ఇప్పటికే అనుచరులతో సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో నామినేషన్లు వేసేవారు కూడా టీడీపీకి కరువవుతున్నట్లు సమాచారం.

Next Story
Share it