ఇంట్లో భార్య శవంతో భర్త మూడు రోజులు

ఓ భర్త భార్య శవాన్ని ఇంట్లో పెట్టుకుని మూడు రోజుల పాటు గడిపిన సంఘటన పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడియా జిల్లా చక్దా ప్రాంతానికి చెందిన బచ్చు చందా భార్య భారతి (50)తో  కలిసి నివాసం ఉంటున్నాడు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె మృతి చెందడంతో భర్త ఈ విషయం ఎవరికి తెలియనివ్వకుండా భార్య శవం పక్కనే మూడు రోజుల పాటు గడిపాడు.

మూడు రోజుల తర్వాత ఇంట్లో కుళ్లిపోయినట్లు వాసన రావడంతో గమనించిన స్థానికులు బచ్చు చందా ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో శవం కనిపించింది. దీంతో స్థానికులు చందా ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి నిలదీశారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు బచ్చు చందాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు. కాగా, నిజంగా కాలేయ వ్యాధితో భార్య మృతి చెందిందా..?లేక చంపేసి ఉంటాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.