నీషమ్‌తో గొడవకు దిగిన రాహుల్.. ఎందుకంటే..

 Published on  11 Feb 2020 12:47 PM GMT
నీషమ్‌తో గొడవకు దిగిన రాహుల్.. ఎందుకంటే..

కివీస్‌తో బే ఓవర్‌ వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ కేఎల్ రాహుల్ సహనం కోల్పోయాడు. కివీస్‌ బౌలర్‌ జేమ్స్ నీషమ్‌తో గొడవకు దిగాడు. అంపైర్‌ మధ్యలో కలుగజేసుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది.

అసలేం జరిగిదంటే..

జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా షాట్ ఆడిన కేఎల్ రాహుల్.. సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. కాగా.. బౌలర్ నీషమ్ కూడా బంతి విసిరిన తర్వాత పిచ్ నుంచి వెనక్కి అడుగులు వేసుకుంటూ రాహుల్‌కి అడ్డుగా వెళ్లాడు. అతడ్ని ఢీకొట్టబోయిన రాహుల్.. ఆఖరి క్షణంలో తన దారిని మార్చుకుని సింగిల్ పూర్తి చేశాడు. బంతి విసిరిన తర్వాత పిచ్ మధ్యలో నిల్చొని ఉన్న జేమ్స్ నీషమ్ ఉద్దేశపూర్వకంగానే తన దారికి అడ్డుగా వచ్చాడని రాహుల్ ఆరోపిస్తూ.. అతనిపై గొడవకి దిగాడు. మధ్యలో అంపైర్ కలగజేసుకుని సర్దిచెప్పడంతో రాహుల్ వెనక్కి తగ్గాడు. కానీ మళ్లీ నీషమ్ తన నోటికి పని చెప్పడంతో రాహుల్ కోపంగా అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

కాగా వీరిద్దరు మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టీమ్ తరుపున ఆడనున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్‌ 47.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 300 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

Next Story
Share it