ఏపీ, తెలంగాణలో జరిగిన ఐటీ సోదాల్లో దిమ్మదిరిగే నిజాలు.. అహ్మద్‌ పటేల్‌కు నోటీసులు

By సుభాష్  Published on  6 March 2020 6:41 AM GMT
ఏపీ, తెలంగాణలో జరిగిన ఐటీ సోదాల్లో దిమ్మదిరిగే నిజాలు.. అహ్మద్‌ పటేల్‌కు నోటీసులు

కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను విచారణకు హాజరు కావాలని రెండో సారి ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. హవాలా సొమ్ము విషయమై ఈ నోటీసలు జారీ అయ్యాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి హవాలా మార్గంలో నిధులు అందాయని ఐటీ శాఖ గుర్తించింది. కాగా, ఏపీ, తెలంగాణలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో దిమ్మదిరిగే నిజాలు బయటకు వచ్చాయి. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు వేలకోట్ల రూపాయలను కాంగ్రెస్‌ పార్టీ కోసం అహ్మద్‌పటేల్‌కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసినట్లు సమాచారం. ఏపీలో ప్రముఖ వ్యక్తిని కూడా ఐటీ అధికారులు త్వరలో విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు మాజీ పీఏను ఆరు రోజుల పాటు ఐటీ, ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

రూ. 150 కోట్లు తీసుకున్న నేతలు ఎవరో..?

రూ. 150 కోట్ల నగదును తీసుకున్న నేతలు ఎవరో ఆదాయపన్ను శాఖ పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. 150 కోట్ల రూపాయలు తీసుకున్న ఆంధ్రుడు అంటూ గత ఏడాది నంబర్‌ 11న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ ప్రకటన చేసింది.

అమరావతిలో 2652 కోట్ల పనులకు సంబంధించి ఓ కంపెనీ నాటి ముఖ్యనేతలకు అందజేసినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబైకి చెందిన షాపూజీ పల్లంజీ నిర్మాణ సంస్థ ద్వారా నేరుగా ప్రముఖ వ్యక్తికి రూ. 150 కోట్లు చేరినట్లు ఐటీ అధికారుల దర్యాప్తులు తేలినట్లు తెలుస్తోంది. అమరావతి సీఆర్డీఏ పరిధిలో నిర్మాణ పనులకు మూడు ప్రముఖ కంపెనీలను ఎంపిక చేయగా, వివిధ వర్గాల వారికి రూ. 2652 కోట్ల వ్యయంతో చేపట్టిన గృహాల సముదాయ నిర్మాణ పనులను అప్పటి ప్రభుత్వం ఓ మేజర్‌ కాంట్రాక్ట్‌ను ఈ సంస్థకు ఇచ్చింది. 20శాతం చొప్పున ముడుపులు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, ఆ చెల్లింపుల్లో దాదాపు రూ.700 కోట్లు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇక తొలిదశలో రూ.150 కోట్ల అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో స్పష్టమైంది.

ఆదాయపన్ను శాఖ సమన్లను ధృవీకరించిన అహ్మద్ పటేల్

గత ఫిబ్రవరి 6న ప్రముఖ కంపెనీకి చెందిన 40 ప్రదేశాల్లో ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహించింది. కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌కు 14వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని అదే నెల 11వ తేదీన సమన్లు పంపింది. ఈ విషయాన్ని దృవీకరిస్తూ తన ఆరోగ్యం కూడా బాగా లేదని, అంతేకాకుండా పార్లమెంట్‌ వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని, అందులో ఒక సమన్‌ పార్లమెంట్‌ ఇమెయిల్‌కు పంపారని చెప్పుకొచ్చారు. కాగా, ప్రతీ రాజకీయ పార్టీకి ఇటువంటి వ్యవహారాలు సహజమేనని, త్వరలో ఈ సమన్లకు స్పందిస్తానని చెప్పారు.

2019 అక్టోబర్‌లో ఆదాయపన్ను శాఖ హైదరాబాద్‌లో నిర్వహించిన సోదాల్లో 170 కోట్లు పంపిణీ జరిగినట్లు గుర్తించిన అనంతరం, పంపిన సమన్లకు సమాధానం చెప్పడానికి జూనియర్‌ స్థాయి అధికారులను కాంగ్రెస్‌ పార్టీ పంపిందని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. ఆదాయపన్ను సెక్షన్‌131 ప్రకారం అహ్మద్‌పటేల్‌కు ఈ సమన్లు చేరినట్లు తెలుస్తోంది.

గతంలో వచ్చిన వార్తల ప్రకారం గోవా, భోపాల్‌, ఇండోర్‌, న్యూఢిల్లీలో 2019 ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్‌లోని పలు ప్రభుత్వ శాఖల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి నగదు అందినట్లు ఆధారాలతో సహ ఐటీ శాఖ ధృవీకరించింది. దీంతో పాటు మరో రూ.20 కోట్లు కాంగ్రెస్‌ నాయకుడు కమలనాథ్‌కు అందినట్లు కూడా ఐటీ శాఖ పేర్కొంది. సెక్షన్‌ 13 ఏ ప్రకారం మొత్తం అన్ని కలిపి 400 కోట్లు అందినట్లు తెలుస్తోంది.

మొత్తం రూ.2 వేల కోట్లు

హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖలలో నిర్వహించిన ఐటీ సోదాలలో పార్టీ వ్యక్తులకు మొత్తం రూ. 2వేల కోట్లు అందినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రముఖ వ్యక్తి త్వరలో ఐటీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.

Next Story