విజయవాడ: ఐదు నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. అమరావతితో ఎటువంటి కట్టడాలు లేవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బుద్దా మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ‘జగన్‌ సొంతింటికి రూ.73 లక్షల ప్రజా ధనాన్ని ఎలా కేటాయించారని, అయిపోయిన ఇంటికి డబ్బులు తీసుకోవడమే.. నిజాయతీనా, ఇదేనా జగన్‌.. రూపాయి తీసుకొని పాలన చేయడమా’ అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన 24 గంటల్లోనే 447 జీవోను విడుదల చేశారు. తనకు అడ్డు వస్తే ఎవరైనా ఇంతే అన్న విధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు గత టీడీపీ ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం రూ.250 అంతా తన ఘనతగా చెప్పుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలుగా ఉన్నవారికే ఆ డబ్బు పంపిణీ చేస్తున్నారని బుద్దా ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాపాడింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు సాయం చేసింది గోరంత.. చెప్పుకునేది కొండం.. ఇదే జగన్‌ నైజం. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్‌ విలన్‌ కాబట్టే.. జైలుకెళ్లారు, చంద్రబాబు హీరో కాబట్టే బయట ఉన్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఉడత బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ‘నేను చంద్రబాబు భక్తుడిని.. నాజీవితం ఆయనకు అంకితమని’ బుద్ధా వెంకన్న తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.