ముస్లిం అషూర్ ఖానా పనులకు మజ్లిస్ ఎమ్మెల్యే మోకాలడ్డు

By అంజి  Published on  1 Jan 2020 6:07 AM GMT
ముస్లిం అషూర్ ఖానా పనులకు మజ్లిస్ ఎమ్మెల్యే మోకాలడ్డు

షియా మతానుయాయులకు అషూర్ ఖానాలు అతి పవిత్రం. అలనాటి కర్బలా యుద్ధంలో అమరులైన హసన్, హుసేన్, అలీ, ఫాతిమాల చిహ్నాలనే అషూరాలు అంటారు. వీటిని ఏడాదిపాటు జాగ్రత్తపరిచి మొహర్రం నాడు బయటకి తీస్తారు. దీన్నే తాజియాలు అంటారు. తెలుగునాట ఈ తాజియాల ఊరేగింపునే పీర్ల పండుగ అంటారు. ఈ తాజియాలు లేదా అషూరాలను భద్రపరిచే చోటును అషూర్ ఖానా అంటారు. కానీ ఇప్పుడు పాతబస్తీలో అషూర్ ఖానాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అవి ఆక్రమణలకు గురవుతున్నాయి. వాటి కప్పులు కూలిపోతున్నాయి. వాన నీళ్లు లోపలికి చొరబడుతున్నాయి. గోడలు చెమ్మగిల్లిపోయాయి. ప్రతి విషయానికీ రోడ్డెక్కే మజ్లిస్ పార్టీ వీటిని గురించి పట్టించుకోవడానికి బదులు వాటిని కబ్జా చేసేందుకు తహతహలాడుతోంది.

వీటన్నిటిలో ప్రముఖమైనది బాద్ షాహీ అషూర్ ఖానా. బాద్షాహీ అషూర్ ఖానాకు మరమ్మత్తులు చేయడం చాలా అవసరం. కానీ దానికి అడ్డుపడుతున్నది యాకుత్ పురా ఎమ్మెల్యే మజ్లిస్ నేత అహ్మద్ పాషా ఖాద్రీ. సదరు ఎమ్మెల్యే ఒక దురాక్రమణదారుకు మద్దతుగా, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి మరీ మరమ్మత్తులకు అడ్డుపడుతున్నారు. ఈ విషయాన్ని అషూర్ ఖానా కేర్ టేకర్ మీర్ అబ్బాస్ అలీ మూసావీ. లోపలి భాగంలోని నియాజ్ ఖానా, మినీ అషూర్ ఖానా, సరాయ్ ఖానా, మఖానే ముజావర్ లకు మరమ్మత్తులు చేయనిచ్చినా, బయటి భాగంలో మరమ్మత్తులు చేయనివ్వడం లేదు. హైదరాబాద్ వారసత్వ కట్టడాల పరిరక్షణ సంస్థ హెరిటేజ్ తెలంగాణ ఇన్ చార్జ్ డైరక్టర్ జీ హెచ్ ఎంసీకి లేఖ వ్రాసినా ఫలితం లేకుండా పోయింది.

ఈ మధ్య కాస్త తవ్వకాలు చేపట్టినా, ఎమ్మెల్యే స్వయంగా వచ్చి, తవ్వి తోడిన మట్టిని మళ్లీ గుంటలో పోయించారు. అషూర్ ఖానా కేర్ టేకర్ హైకోర్టు ఆదేశాలను చూపిస్తే ఎమ్మెల్యే ఆ కాగితాలను చించిపారేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేని స్పష్టీకరణ అడిగితే “నాకేం తెలియదు” అని బుకాయించేశాడు.

Next Story