ఈ రోజుల్లో డబ్బుల విషయంలో, ఇంకేదైన విషయంలో నమ్మకంగా ఉండాలంటే ముందుగా బాండ్‌ పేపర్‌ రాసుకుంటారు. అయితే భార్య, భర్తల మధ్య ఉన్న బంధానికి బాండ్‌ పేపర్‌తో ముడిపెట్టాడు ఓ భర్త. తాను వేరే మహిళతో ఎలాంటి లైంగిక సంబంధాన్ని పెట్టుకోబోనని, అంతేకాకుండా ఇతర మహిళలతో ఏ విధంగానైనా అసభ్యకరంగా ప్రవర్తించబోనని, నిన్ను మాత్రం బాగా చూసుకుంటానని స్పష్టం చేస్తూ ఓ భర్త తన భార్యకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 25 సంవత్సరాల యువకుడు 2012లో మణినగర్‌ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వారికి నాలుగు సంవత్సరాల కూతురు కూడా ఉంది. కాగా, ఆ యువకుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఈ విషయం భార్యకు తెలిసిందే. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఓ రోజు ఈ వివాదం పెద్దదైంది. ఇలాంటి భర్తతో తాను కాపురం చేయలేనంటూ భార్య తెగేసి చేప్పేసి బట్టలు సర్దుకుని బయలుదేరింది.

దీంతో నలుగురిలో పరువు పోతుందని భావించిన భర్త, అమె కాళ్లను పట్టుకుని బతిమిలాడాడు. ఇక చివరకు ఆమె కనికరించి, ఎక్కడికి వెళ్లకుండా కాపురం చేసేందుకు అంగీకరించింది. ఇప్పటి నుంచి ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకోనని చెప్పాడు. అందుకు భార్య నమ్మలేదు. తనకు నమ్మకం కలగాలంటే ఇలాంటి పనులు ఇంకో సారి చేయనని స్పష్టం చేస్తూ బాండ్‌ పేపర్‌ రాసివ్వాలని భార్య కోరగా, అందుకు భర్త అంగీకరిస్తూ రూ. 100 బాండ్‌ పేపర్‌ తీసుకొచ్చి.. ‘నేను ఇంకెప్పుడు నిన్ను మోసం చేయను. పర స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకోను. ఇక నుంచి నీతో బాగా ఉంటా. నిన్నెప్పుడు కొట్టను.. తిట్టను అని బాండ్‌పేపర్‌ పై రాసిచ్చాడు.

కాగా, ఈ బాండ్‌ పేపర్‌ 2019, ఆగస్టులో రాసివ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భార్యాభర్తలు బాగానే ఉంటూ వస్తున్నా.. తాజాగా భార్యకు భర్త తండ్రి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇంట్లో కూర్చుండి తింటున్నావ్‌, ఏదో ఉద్యోగం చేయవచ్చుకదా అంటూ వేధించడం మొదలు పెట్టడంతో భార్య ఆమె మామపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ బాండ్‌ పేపర్‌ విషయం బయటకు వచ్చింది. కాగా, పోలీసులు భార్యభర్తలను, ఆమె మామను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.