కొడుకు కోసం వ్యభిచార రొంపిలోకి.. ఆ పై ఏం జరిగిందంటే..

ఓ మహిళ.. భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా తన కొడుకుతో కలిసి ఉంటోంది. కొడుకును పెంచి పోషించడానికి చిన్న చిన్న పనులు చేసింది.. అయితే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. ఆ డబ్బుతో తన కుమారుడిని చదివించి ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకుంది. కాగా.. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు.

ఘటన వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహితకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. కాగా మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా తన ఏనిమిదేళ్ల కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటోంది. కొడుకును పోషించుకోవడానికి ఆమె చిన్న చిన్న పనులు చేసేది. అయితే ఆదాయం తక్కువగా ఉండడంతో ఇళ్లు గడవం కష్టంగా మారింది. సరిగ్గా అదే సమయంలో నరసరావుపేటలో వ్యభిచార గృహాం నిర్వహించే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టడంతో చేసేది లేక వ్యభిచారం వృత్తిలో దిగింది. నరసరావుపేట మహిళ ఇంట్లో మూడు రోజులు ఉంది. అనంతరం డబ్బులు ఇవ్వాలని నిర్వాహకురాలిని కోరింది. ఇందుకు నిర్వాహాకురాలు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధిత మహిళ చెప్పడంతో నిర్వాహకురాలు భయపడింది. పోలీసులకు ఈ విషయాలు తెలిస్తే తన ఆటలు సాగవని.. ఇందుకు ఏకైక మాత్రం ఆ మహిళను చంపడమే అని నిర్ణయించుకుంది.

జనవరి రెండో వారంలో డబ్బులు ఇస్తామని మహిళను నమ్మించి వ్యభిచార నిర్వాహాకురాలు, ఆమె భర్త, ఓ విటుడు ఆమెను గుత్తికొండలోని సాగర్‌ కాలువ వద్దకు తీసుకెళ్లారు. అక్కడకు అందరూ కలిసి మద్యం సేవించారు. మహిళ మత్తులోకి జారుకున్న అనంతరం ముగ్గురు కలిసి మహిళను కాలులోకి తోసేశారు. ఊపిరి ఆడక మహిళ మృతి చెందింది. తన కుమారై కనపడడం లేదంటూ మహిళ తల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన క్రమంలో గుంటూరు బ్రాంచ్‌ కెనాల్ లో ఆ మహిళ మృతదేహాం కనిపించింది. మొదట ఆత్మహత్యగా భావించినా.. తరువాత పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. మహిళ ఫోన్ కాల్స్‌ ఆధారంగా వ్యభిచార గృహ నిర్వాహాకురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా.. తామే ఆ మహిళను హతమార్చినట్లు విచారణలో అంగీకరించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్