ఉద్రిక్త 'అమరావతి'.. మందడంలో తీవ్ర ఆందోళనలు

By అంజి  Published on  21 Dec 2019 3:27 AM GMT
ఉద్రిక్త అమరావతి.. మందడంలో తీవ్ర ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం ప్రధాన రహదారిపై అడ్డంగా ట్రాక్టర్లు, బల్లలు పెట్టి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు టైర్లు తగలబెట్టారు. ఈ నేపథ్యంలో అమరావతిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ అమరావతి రాజధాని గ్రామాల్లోని ప్రజలకు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో ప్రజలు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. జీఎన్‌ రావు కమిటీ నివేదికపై రాజధాని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని జీఎన్‌రావు కమిటీ తీసుకోలేదని, రాజధాని లేకుండా అభివృద్ధి ఎలా చేస్తారని రైతులు మండిపడుతున్నారు. రాయపూడిలో హైకోర్టుకు వెళ్లే మార్టంలో ఇవాళ రైతులు వంటవార్పు కార్యక్రమం చేపడుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. రైతులతో పాటుగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.

మంత్రి బొత్స వ్యాఖ్యలు..

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి బొత్స నారాయణ పేర్కొన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతి ఒక్కటే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అని బొత్స చెప్పుకొచ్చారు. ఏ అంశమైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, చుట్టాల కోసం.. ప్రజల సొమ్మును టీడీపీ దోపిడీ చేసిందని బొత్స ఆరోపించారు. రూ.లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మించే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం విజయవాడలో కూడా ఉంటుందన్నారు. శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీ రిపోర్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందని బొత్స అన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికపై ఈ నెల 27న కేబినెట్‌ భేటీలో చర్చిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Next Story
Share it