ఇండియాలో జాగ్రత్త..!

By Newsmeter.Network  Published on  24 Dec 2019 5:25 AM GMT
ఇండియాలో జాగ్రత్త..!

పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దేశంలోని పలు చోట్ల ఆందోళనలు జరుగుతుండటంపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించే అమెరికా పౌరులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ఆందోళనలకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా ద్వారా తెలుసుకుని ఆ ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా హింసాత్మక ప్రదర్శనలు కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌కు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకువాలని సూచించింది. వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లకుండా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరింది.

ప్రదర్శనలు, ట్రాఫిక్ అవాంతరాలు ఉన్న ప్రాంతాలను సందర్శించడం మానుకోవాలని, పర్యటించాలనుకున్న పరిసరాల గురించి ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. తాము ఎక్కడకు వెళ్ళేది, ఎప్పుడు తిరిగి వచ్చేది వంటి వివరాలు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ముందే తెలియజేయాలని పేర్కొంది. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, స్మార్ట్ ట్రావెలర్స్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్ లో నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే తాజ్ మహల్ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయని, అక్కడికి ప్రశాంతంగా వెళ్లిరావచ్చని తెలిపింది. ఆ దేశ రాయబార కార్యాలయం పేర్కొంది. విదేశాలలో ప్రయాణించే అమెరికా పౌరులు ప్రపంచవ్యాప్త హెచ్చరికలు, ప్రయాణ హెచ్చరికలు, దేశ నిర్దిష్ట సమాచారం కోసం యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూడాలని సూచించింది. భారత్ లో పర్యటిస్తున్న తమ వారి భద్రతా సమాచారం కోసం అమెరికా పౌరులు ట్రావెలర్స్ చెక్లిస్ట్‌ని ఎప్పటికప్పుడు చూసుకోవాలని పేర్కొంది.

Next Story