క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డానికి ఏప్రిల్ 14 వ‌ర‌కు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇదిలా ఉంటే.. ఈ లాక్ డౌన్ కాలంలో ఇంట్లో భార్యలతో భర్తలు పడలేకపోతున్నారు. లేకపోతే.. మొగుళ్లతో పెళ్లాలు ఏగలేకపోతున్నారు. ఈ విష‌యాల‌ను ప‌క్క‌న ప‌డితే..ఓ వ్య‌క్తికి ఇద్ద‌రు భార్య‌లు. లాక్‌డౌన్ తో అటు ఇటు వెళ్లలేక ఇద్దరి భార్య‌ల‌తో ఒకే చోట ఉంటున్నాడు. తాగి ఇంటికి వ‌చ్చాడు. దీంతో ఇద్ద‌రు భార్య‌లు భ‌ర్త‌ను నిల‌దీశారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన భ‌ర్త క‌త్తితో దాడికి తెగ‌బ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.

విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గూడెంకాలనీ గ్రామానికి చెందిన వంతల నాగరాజుకు లక్ష్మీ, సుశీల అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరూ ఒకే గ్రామంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ అమ‌లు కావ‌డంతో అటు ఇటు వెళ్ల‌లేక నాగ‌రాజు.. అంద‌రం క‌లిసి ఉందామ‌ని ఇద్ద‌రు భార్య‌ల‌తో అన్నాడు. దీనికి ఇద్ద‌రు భార్య‌లు స‌రే అన్నారు. ముగ్గురు అంగీకారంతో ఒక ఇంటికి చేరుకున్నారు.

ఆదివారం కావడంతో భర్త కోసం ప్రేమగా నాటుకోడి వండారు. మిర్చీ మసాలా బాగా దట్టించి ఘుమఘుమలాడే కోడికూర తయారు చేశారు. భ‌ర్త కోసం ఇద్ద‌రు భార్య‌లు ప్రేమ‌తో ఎదురు చేస్తున్నారు. ఇంతలో బయటకు వెళ్లిన నాగరాజు పూటుగా మ‌ద్యం తాగి వ‌చ్చాడు. అంతే అప్పటివరకు భర్త కోసం ఎదురు చూసిన ఇద్దరు భార్యలు అమ్మోరు అవతారమెత్తారు. ఇంటికి తాగి వస్తావా అని చెడామడా తిట్టేశారు.

దీంతో.. నాగరాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. కోడిని కోసే కత్తిని పెద్దభార్య లక్ష్మిపైకి విసిరాడు. దీంతో కత్తి నేరుగా వెళ్లి ఆమె తలకు తగిలింది. దీంతో ఆమెకు తీవ్ర గాయ‌మైంది. వెంట‌నే స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.