అనుమతి లేకుండానే అవి గాల్లో ఎగురుతున్నాయా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 April 2020 10:59 AM GMT
అనుమతి లేకుండానే అవి గాల్లో ఎగురుతున్నాయా..?

ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు డ్రోన్లను విరివిగా ఉపయోగించడం మొదలు పెట్టారు. క్రిమిసంహారకాలను స్ప్రే చేయడానికి, నిఘా కోసం డ్రోన్లను వాడేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డి.జి.సి.ఏ.) అనుమతి లేకుండా ఈ పనులు చేస్తోందట..! డి.జి.సి.ఏ. నిబంధనల ప్రకారం రిమోట్లీ పైలేటెడ్ ఎయిర్క్రాఫ్ట్(RPA) లేదా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(యు.ఏ.వి.)లకు UAOP అనుమతి లేకుండా ఎటువంటి పదార్థాన్ని కూడా గాల్లో విడిచిపెట్టడానికి అనుమతి లేదు.

నానో, మైక్రో కేటగిరీ డ్రోన్ ఆపరేటర్లు కాకుండా మిగిలిన డ్రోన్ ఆపరేటర్లు అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్ పర్మిట్(UAOP) ను డి.జి.సి.ఏ. నుండి పొందాల్సి ఉంది. మెడిసిన్స్ ను అత్యవసర సమయాల్లో పంపించడానికి మార్చి నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డి.జి.సి.ఏ. ప్రత్యేక అనుమతిని ఇచ్చింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ ల వాడకాన్ని విపరీతంగా పెంచేసింది.. కానీ డి.జి.సి.ఏ. అనుమతులను మాత్రం తీసుకోవడం లేదు. కేవలం స్థానిక అధికారులతో అనుమతులను తీసుకుని వారు డ్రోన్ ల సహాయంతో పనులు కానిస్తున్నారు. ఐటీ అండ్ ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ 'ప్రస్తుతం తాము డ్రోన్ ల వినియోగానికి స్థానిక అధికారుల పర్మిషన్ తీసుకుంటూ ఉన్నామని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కూడా ముఖ్యమేనని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నామని' అన్నారు.

ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కాదు మొత్తం 10 రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తూ ఉన్నాయని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడుస్తోందని చెప్పుకొచ్చారు. డి.జి.సి.ఏ. నుండి తాము అనుమతి తెచ్చుకోలేదని.. అది చాలా సుదీర్ఘ ప్రక్రియ అని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొందరగా ఏది అవలంబిస్తే అందరికీ మంచిదో అలాంటి వాటికే మొగ్గు చూపుతామని అన్నారు. ఇప్పుడే కాదు కొన్నేళ్లుగా డి.జి.సి.ఏ. నిబంధనలు డ్రోన్ ఆపరేటర్లకు ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయని అన్నారు. నిబంధనల్లో మార్పులు, సడలింపులు తీసుకుని రావాలని అభిప్రాయ పడ్డారు.

రాచకొండ పోలీసులు డ్రోన్ ల సహాయంతో విధులు నిర్వర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంట్రోల్ రూమ్ లోనే ఉంటూ.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గూమిగూడిన వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరెవరు అనవసరంగా ఇల్లు దాటి వస్తున్నారో వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉన్నారు. Cyient గ్లోబల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థకు చెందిన డ్రోన్లను, ఎక్విప్మెంట్ లను అధికారులు ఉపయోగిస్తూ ఉన్నారు. బి.ఎన్.రెడ్డి కాలనీలో డ్రోన్ల ద్వారానే గూమిగూడిన జనాలను కొన్ని క్షణాల్లో చెదరగొట్టారు.

పోలీసులు తొందరగా చేరుకోలేని చోటుకు డ్రోన్ కెమెరాలు అలా చేరుకుంటూ వారికి ఎంతగానో తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి. రాచకొండ ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 'తాము ఎప్పటికప్పుడు కరోనా వైరస్ ప్రబలే అవకాశమున్న ప్రాంతాలను జల్లెడ వేస్తున్నామని.. కంటెయిన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని' అన్నారు. డ్రోన్ కేమేటాలు, థర్మల్ ఇమేజింగ్ పేలోడ్స్, స్కై స్పీకర్లను పోలీసులు ఉపయోగిస్తున్నారు. స్కై స్పీకర్ల ద్వారా అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు పోలీసులు.

Next Story