సామాన్యంగా భార్య, భర్తల మధ్య గొడవలు అనేవి సహజం. కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేవి జరుగుతూనే ఉంటాయి. చివరకు వారి గొడవలు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా చాలానే చూస్తుంటాం. కాని భార్యభర్తల గొడవల కారణంగా భర్త చేసిన పనిని చూస్తే ఎవరైన ఆశ్చర్యపోవాల్సిందే.

ఓ ఇంట్లో భార్యతో ఘర్షణ పడ్డ ఓ భర్త తన పురుషాంగాన్ని కోసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివాహమై చాలా కాలమైనప్పటికీ పిల్లలు కలగడం లేదని తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. భర్తకు మగతనం లేకపోవడంతోనే పిల్లలు కావడం లేదని భార్య నానా రకాలుగా తిడుతూ గొడవ పడటంతో, భర్త ఆవేశంతో తన మర్మాంగాన్ని కోసుకోవడం సంచలనంగా మారింది. ఇరువురి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబు (40), దేవి (35) అనే దంపతులు చెన్నైలోని వాషర్‌మన్‌పేటలో నివసం ఉంటున్నారు. పిల్లలు కాకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల భర్త బాబు మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక వైపు సంతానం కావడం లేదన్న బాధ, మరో వైపు భర్త మద్యానికి బానిసయ్యాడనే బాధ దేవి తట్టుకోలేకపోయింది. కాగా, గత సోమవారం భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో దేవి పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, తట్టుకోలేకపోతున్నానని, విడాకులు కావాలని తల్లిదండ్రులతో తెలిపింది. ఈనెల 1న భర్త బాబు అత్తారింటికి వెళ్లాడు. అక్కడ కూడా మరోసారి గొడవ జరిగింది. ‘నీకు మగతనం’ లేదని, నీతో విడాకులు తీసుకుంటానన్న భార్య మాటలతో మనస్థాపానికి గురైన భర్త కిచెన్‌లోకి వెళ్లి తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ ఘటనను చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బాబును వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.