జగన్ సరికొత్త వ్యూహం.. ‘స్థానికం’ వేళ టీడీపీకి కష్టాలే!

By Newsmeter.Network  Published on  9 March 2020 7:57 AM GMT
జగన్ సరికొత్త వ్యూహం.. ‘స్థానికం’ వేళ టీడీపీకి కష్టాలే!

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావటంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు వైసీపీ, అటు టీడీపీలు స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు టీడీపీ ప్రయత్నిస్తుండగా.. అధికార వైసీపీ మాత్రం టీడీపీ వ్యూహాలకు చెక్‌పెట్టుకుంటూ వస్తుంది. తాజాగా వైసీపీ కొంతపంథాను ఎంచుకుంది. టీడీపీలోని ముఖ్యనేతలను తమ పార్టీ వైపు ఆకర్షించుకోవటం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను గట్టి దెబ్బకొట్టవచ్చని భావిస్తుంది.

దీనిలో భాగంగానే టీడీపీ నేత డొక్యా మాణిక్య వరప్రసాద్‌ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతుంది. డొక్కా చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికల వేళ చివరి నిమిషంలో పత్తిపాడు సీటు కేటాయించారని ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి పాలవుతానని తెలిసినా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వైకాపా పెద్దలతో మంతనాలుసైతం చేసినట్లు ప్రచారం సాగుతుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలోపే ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Also Read: టీడీపీకి షాకిచ్చిన మాజీమంత్రి

మరోవైపు కడపలోనూ టీడీపీకి ఎదురు దెబ్బ తగలనుంది. ఆ పార్టీకి చెందిన రామ సుబ్బారెడ్డి టీడీపీని వీడుతారని ప్రచారం సాగుతుంది. జమ్మలమడుగు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన రామసుబ్బారెడ్డి పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వైసీపీ పెద్దలు ఆయన రాకకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు, ఉన్నత స్థాయిలో ఉంచుతామని వైసీపీ పెద్దలు మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

త్వరలోనే టీడీపీకి రామసుబ్బారెడ్డి రాజీనామాచేసి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో అధికార పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ఆ నియోజకవర్గంలోని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సత్తాచాటేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ వ్యూహాలను ముందే పసిగడుతున్న టీడీపీ నేతలు వాటికి అడ్డుకట్ట వేయలేక పోతున్నారని చర్చ సాగుతుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటువంటి పరిణామాలు పార్టీని మరింత దెబ్బతీస్తాయని తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story