జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన 'చిరంజీవి'..!
By సుభాష్ Published on 21 Dec 2019 4:24 PM ISTఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు నిరసనలు తెలిపారు. జగన్ నిర్ణయాన్ని కొందరు స్వాగతించగా, మరి కొందరు వ్యతిరేకించారు. తాజాగా మెగాస్టార్, మాజీ మంత్రి చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. ఇటీవల సినిమా ప్రమోషన్లో భాగంగా జగన్‌ను కలిసిన మెగాస్టార్, తర్వాత జగన్ సర్కార్ తీసుకున్న దిశ చట్టంపై కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై కూడా చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని చిరంజీవి చెప్పుకొచ్చారు.. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకముందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖను కార్యనిర్వాహక, కర్నూలును న్యాయపరిపాలనను రాజధానులుగా మార్చే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని చిరంజీవి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫారసులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయన్నారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే ఉండేదని, ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురికావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో .. ఇంకో లక్ష కోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
తాగు, సాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక గ్రామాలు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల విధానం భద్రతనిస్తుందని చెప్పారు. ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతాభావాన్ని తొలగించాలని అన్నారు. వాళ్లు కూడా ఎలాంటి నష్టాలకు గురి కాకుండా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జగన్‌ను కోరారు.