అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి తన మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పాడానికి.. తమ ఐదేళ్ల పాలన మీద వేసిన సిట్‌ మరో ఉదహరణ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తొమ్మిది నెలల్లో మూడు సిట్‌లు, ఐదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీనే కాదు, ఎకంగా ఏపీనే టార్గెట్‌ చేశారని.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

భావి తరాలకు తీరని నష్టం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారని.. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తామంటూ అధికారులను బతిమిలాడుకున్నారని చంద్రబాబు అన్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరమేయడం తప్ప ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. జీవో 344.. వైసీపీ ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ట అని అన్నారు.

గత ఐదేళ్ల నిర్ణయాలపై మీరు(వైసీపీ) సిట్‌ వేశారని.. మీ(వైసీపీ) ఐదేళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్‌ వేస్తుందన్నారు. కక్ష సాధించుకోవడం తప్ప.. ప్రజలకు వీటివల్ల ఎలాంటి లాభం ఉంటుందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. వైఎస్సార్‌ హయాంలో తన మీద 26 విచారణలు (14 సభా సంఘాలు, 3 ఉప సంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో నాలుగు విచారణలు, ఒకటి సీబీసీఐడీ ఎంక్వైరీ) చేయించారని.. ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్‌ చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. సిట్‌నే పోలీస్‌స్టేషన్‌గా పరిగణిస్తాననడం.. తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ తన అజెండగా పెట్టుకుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏనాడు ఎటువంటి తప్పులు చేయలేదన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.