కాళ్లు, చేతులు మంచానికి క‌ట్టేసి.. ప‌చ్చిమిర్చి ముద్ద‌ల‌ను ఒక్కొక్క‌టిగా..

ఇట్టా చేస్తావా..? అస‌లు నీకు ఇంత ధైర్యం ఎక్క‌డి నుండి వ‌చ్చిందే..? చ‌స్తే ఇక్క‌డే చావు. మేం బ‌తికేదే ఈ వ్యాపారంతో. అటువంటిది మా వ్యాపారాన్నే చెడ‌గొట్టాల‌ని చూస్తావా..? అంటూ ఓ ఇద్ద‌రు న‌న్ను మంచంపై ప‌డుకోబెట్టి చేతులు, కాళ్ల‌ను తాళ్ల‌తో క‌ట్టేశారు. అంత‌టితో ఊరుకోక‌, అప్పుడే బ‌జారు నుండి తెచ్చిన ప‌చ్చి మిర‌ప కాయ‌ల‌ను సంచిలో నుండి బ‌య‌ట‌కు తీసి మిక్సీలో వేసి ముద్ద‌గా అయిన త‌రువాత చిన్న చిన్న ఉండ‌లుగా చేశారు. అలా త‌యారు చేసిన ప‌చ్చిమిర్చి ఉండ‌ల‌ను ఒక్కొక్క‌టిగా నా రెండు క‌ళ్ల‌లో వేస్తూ వారి కోపాన్ని తీర్చుకున్నారు.

నేను ఆ బాధ‌నంతా భ‌రించ‌డానికి అస‌లు కార‌ణం నాతోపాటు వ్య‌భిచార కూపంలో ఇరుక్కున్న తోటి వారిని కాపాడ‌టం కోస‌మే. వ్య‌భిచార స్థావ‌రం నుండి నాతోపాటు వారిని కూడా ఎలాగోలా బ‌య‌టప‌డేసేందుకు ప్లానేశా. నేను ఎలాగో చ‌నుబాలు మ‌హిళ‌ను క‌నుక వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్స్ ద‌గ్గ‌ర‌కు న‌న్ను పంపేవారు కాదు. దాంతో టీ ఇచ్చేందుకు వ‌చ్చే వారితో రూముకు సంబంధించిన తాళం ఒక‌టి సీక్రెట్‌గా చేయించుకుని, వ్య‌భిచార నిర్వాహ‌కుల‌కు తెలీకుండా అక్క‌డి బాధితులంద‌ర్నీ తీసుకెళ్దామ‌నుకున్నా. అలా నేనేసిన ప్లాన్‌ను కాస్తా బాధితులుగా ఉండేందుకు ఇష్ట‌ప‌డిన కొంద‌రు నిర్వాహ‌కుల‌కు లీక్ చేశారు.

దాంతో నాపై ప‌గ‌బ‌ట్టిన వారు న‌న్ను బెడ్‌పై ప‌డుకోబెట్టి కాళ్లు, చేతులు క‌ట్టేసి ప‌చ్చిమిర్చి కారం ముద్ద‌ల‌ను క‌ళ్ల‌లో పెట్టారు. అదే స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్‌గా వ‌చ్చిన ఓ పోలీసు అధికారి నిర్వాహ‌కుల‌ను బెదిరించి తాళ్ల‌తో బంధింప‌బ‌డిన న‌న్ను విడిపించారు. ప‌చ్చిమిర్చి కార‌ణంగా విప‌రీత‌మైన మంట క‌ల‌గ‌డంతో ప‌క్క‌నే ఉన్న డ్ర‌మ్ము నీటిలో ఓ గంట‌పాటు నా క‌ళ్ల‌ను ఉంచాను. అయినా, ఆ మంట త‌గ్గ‌డానికి దాదాపు మూడు రోజులు ప‌ట్టింది. అంత‌కు ముందే ఆ పోలీసు అధికారితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప‌రిచ‌యం ఏర్ప‌డ‌టంతో ఆప‌ద స‌మ‌యంలో అవ‌స‌రం ఉంటుంద‌ని అత‌ని ఫోన్ నెంబ‌ర్ కూడా తీసుకున్నా. ఆ ఫోన్ నెంబ‌రే వ్య‌భిచార‌కూపం నుండి నేను, నాకు చెల్లి వ‌ర‌స అయ్యే మ‌రో మ‌హిళ బ‌య‌ట ప‌డ‌టానికి స‌హాయ ప‌డింది.

పేద‌ల ఆర్థిక ఇబ్బందులను పెట్టుబ‌డిగా మార్చుకుంటూ, మీకు మేము అండ‌గా ఉంటాం, అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బు స‌మ‌కూరుస్తామ‌న్న మాయ మాట‌ల‌తో న‌మ్మించి మ‌హారాష్ట్ర‌లోని భీవాండి ప్రాంతంలో కొంద‌రు వ్య‌క్తులు న‌డుపుతున్న‌ వ్య‌భిచార‌కూపం నుండి బ‌య‌ట‌ప‌డ్డ స‌రిత చెప్పుకొచ్చిన మాట‌లివి. కాగా, అనంత‌పురం జిల్లా క‌దిరి ప్రాంతానికి చెందిన స‌రిత‌ అత్తింటి వారి వేధింపులు తాళ‌లేక పాప‌తో క‌లిసి పుట్టింట్లోనే ఉండేది. అయితే, త‌న‌కు తానుగా వ్య‌భిచార కూపంలోకి వెళ్ల‌కున్నా.., ప‌క్కింటి వారి మాయ‌మాట‌ల‌తో వ్య‌భిచార నిర్వాహ‌కుల‌కు అమ్మ‌బ‌డింది స‌రిత‌.. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో త‌న‌కు న‌చ్చ‌ని ప‌ని చెయ్య‌లేక‌, అక్క‌డి వారు పెట్టే ఇబ్బందులు తాళ‌లేక ఆఖ‌ర‌కు చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న స‌రిత ధైర్యం ప్ర‌ద‌ర్శించి పోలీసుల సాయంతో అక్క‌డి నుండి బ‌య‌టప‌డ‌గ‌లిగింది.

భీవాండిలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల గురించి క‌న్నీరు మున్నీర‌వుతూ చెప్పుకొచ్చింది స‌రిత‌. మా ప‌ల్లెటూరోళ్లు ప్రాణాలైనా వ‌దులుకుంటారు కానీ.., అలా లొంగము. ఒక్క‌పూట అన్నం లేక‌పోయినా బ‌తుకుతాం కానీ.. అలా సిగ్గు విడిచి బ‌త‌కాలంటే మా చేత కాదు. నా ఇంటి చుట్టుప‌క్క‌ల వాళ్లే న‌న్ను భీవాండిలో అమ్మేయ‌డం చాలా బాధేసింది. అన్నం తింటే క‌స్ట‌మ‌ర్ ద‌గ్గ‌ర‌కు పంపుతార‌ని, భీవాండిలో ఉన్న‌న్ని రోజులు అన్నం తిన‌కుండా ఆక‌లితో ఉండేందుకు ప్ర‌య‌త్నించా. కానీ, ఒకానొక రోజు ఆక‌లి త‌ట్టుకోలేక అన్నం తినేశా, దాంతో ఒక రోజంతా క‌డుపు నొప్పితో బాధ‌ప‌డ్డా. ఆక‌లి త‌ట్టుకోలేకే క‌స్ట‌మ‌ర్ల‌తో ఉండేందుకు సిద్ధ‌ప‌డ్డామంటూ అప్ప‌టికే వ్య‌భిచార‌కూపంలోకి దిగిన వారంతా చెప్పుకొచ్చారంటూ స‌రిత వెల్ల‌డించింది.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *