ఇల్లు అలకగానే పండుగ కాదు. గ్రాఫిక్స్‌లో ఎత్తైన భ‌వ‌నాలు చూపెట్ట‌గానే న‌గ‌రం త‌యారైపోదు. మూడు రాజ‌ధానులంటూ ప్ర‌క‌ట‌న చేయ‌గానే వాటికై అవే ఏర్ప‌డిపోవు. అలా నాడు అమ‌రావ‌తి మ్యాప్ మాత్ర‌మే చూపెట్టారు క‌నుకనే రాజ‌ధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములు ఇంకా ఖాళీ స్థ‌లాలుగా మిగిలి ఉన్నాయి. మూడు విడ‌తల సాగు భూమి బీడుగా మారిన వైనం స‌గ‌టు మ‌నిషి మ‌న‌సును క‌ల‌చివేస్తోంది.

కాగా, మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించి జ్యుడిషియ‌ల్ క్యాపిట‌ల్‌ను క‌ర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అన్ని వ‌స‌తుల‌తో అమ‌రావ‌తిలో నిర్మించిన‌ హైకోర్టు ప‌రిస్థితేంటి..? న్యాయ వ్య‌వ‌స్థ‌ను ఇష్ట‌ రీతిలో త‌ర‌లించే అధికారాలు ప్ర‌భుత్వాల‌కు ఉన్నాయా..? అన్న అనుమానాలు ప్ర‌తి ఒక్క‌రిలోనూ త‌లెత్తుతున్నాయి.

ఈ అంశాల‌పై అధ్య‌య‌నం చేసిన నిపుణులు అమ‌రావ‌తి నుంచి క‌ర్నూలుకు హైకోర్టు త‌ర‌లింపు సాధ్యా సాధ్యాల‌ను విశ్లేష‌ణ చేయ‌గా, ముందుగా అమ‌రావ‌తిలో హైకోర్టు ఏర్పాటు నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు..ఆ వెంట‌నే కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలా..? వద్దా..? అన్న అంశాల‌కు సంబంధించి సెక్షన్ 31 మాత్రం అలా చేయొద్దని చెబుతోంద‌ని న్యాయ నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

ముందుగా, హైకోర్టు త‌ర‌లింపు అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉంటుంద‌ని, హైప‌వ‌ర్ క‌మిటీ నివేదిక అందిన త‌రువాత ఏం చేయాలి..? అన్న దానిపై చ‌ర్చించాల్సి ఉంటుంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా శ్రీ‌బాగ్ ఒప్పందాన్ని బేస్ చేసుకుని తాము ఒక్కొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్ర‌కట‌న చేయాలి. అందులో భాగంగానే అన్ని స‌దుపాయాలు ఉన్న క‌ర్నూలుకు హైకోర్టును త‌ర‌లిస్తున్నామ‌నని, అక్క‌డే భ‌వ‌న నిర్మాణాలు చేప‌ట్టి ఇస్తామ‌ని తీర్మాణం జ‌ర‌గాలి.

అసెంబ్లీ సాక్షిగా చేసిన హైకోర్టు త‌ర‌లింపు తీర్మానాన్ని కేంద్రం వద్దకు పట్టుకుపోయి, కేంద్ర మంత్రుల‌తో ఉన్న ప‌రిచ‌యాలు, పలుకుబడిని ఉపయోగించి ఒత్తిడిచేసి న్యాయశాఖకు సంబంధిత తీర్మాన నివేదిక‌ల‌ను అంద‌జేయాల్సి ఉటుంది. కేంద్రం న్యాయ‌శాఖ ఆ నివేదిక‌ను సుప్రీం కోర్టుకు ఇస్తుంది. సుప్రీం కోర్టు రాష్ట్ర‌ హైకోర్టుకు పంపిస్తుంది. ఇక ఆ త‌రువాత తీర్మానం విచార‌ణ కోసం కమిటీలు వేస్తారు.

హైకోర్టు తరలింపు జరిగే పనేనా..

ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో ఉన్న భ‌వ‌నం టెంప‌ర‌రీ అని, ప‌రిస‌ర ప్రాంతాల్లో క‌నీసం టీ షాపులు కూడా లేవ‌ని హైకోర్టే స్వ‌యాన చెప్పిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల కార‌ణంగా కొన్ని వ‌స్తువులు కొట్టుకుపోయాయ‌ని కూడా న్యాయ స్థాన‌మే చెప్పింది. ఈ అంశాల‌ను ఏక‌గ్రీవ తీర్మానంతో అన్ని హంగుల‌తో అమ‌రావ‌తిలో నిర్మించిన హైకోర్టును అక్క‌డ్నుంచి మ‌ళ్లీ ఎక్క‌డ‌కు మారుస్తారు…? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పొచ్చు.

హైకోర్టు ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన వ‌న‌రులు క‌లిగిన ప్రాంతంగా క‌ర్నూలు ఉంద‌న్న విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు, న్యాయ‌శాఖ‌, కోర్టుల‌కు తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఆపై క‌ర్నూలులోని ఏరియాల‌న్నింటిని క‌లియ‌తిరిగి కోర్టు నిర్మాణానికి స్థ‌లాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జ్యుడిషియల్ క్వార్టర్స్ ఏర్పాటు ఐదేళ్లు పడుతుందా..? లేక పదేళ్లు పడుతుందా..? అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ఈ త‌ర‌లింపు అంశం చివ‌రి ఆరు నెల‌ల్లో జ‌రిగితే మాత్రం ప్ర‌భుత్వానికి ఏ మాత్రం ఫ‌లితం ఉండ‌ద‌ని, అక్క‌డ హైకోర్టు వ‌చ్చింద‌న్న తృప్తి ఉండ‌క‌పోగా.. ఇక్క‌డ అమ‌రావ‌తి ఇంపాక్ట్ దెబ్బ ఎక్కువ‌గానే క‌నిపిస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.