ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు
By Newsmeter.Network
కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. భారత్‌లోనూ ఈ వైరస్ భారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే భారత్‌లో సుమారు 175 కేసుల వరకు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా.. మరికొందరు అనుమానితులు ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్నటి వరకు ఐదు కేసులు నమోదు కాగా.. కరీంనగర్‌లో ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వగా, మాల్స్, పబ్‌లు, థియేటర్లు మూయించి వేశారు. ఎవరూ అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలాఉంటే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది రక్త నమూనాలు సేకరించగా.. వారిలో 94 మందికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో 13మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, వర్సింటీలు, కోచింగ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఇదిలాఉంటే కరోనా వైరస్ డీసీజ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారికి రోగ లక్షణాలు ఉన్నా లేక పోయినా భారతదేశానికి వచ్చిన రోజు నుంచి 14 రోజులు ఖచ్చితంగా ఇంటిలోనే వైద్యుల పరిశీలనలో ఉంచాలని, ఇతర కుటుంబ సభ్యులతో కలవరాదని, సందర్శకులను అనుమతించ రాదని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించవద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు.