శివసేనకు అమిత్ షా షాక్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 3:50 PM GMT
శివసేనకు అమిత్ షా షాక్..!

ఏదో ఒకరోజు శివసైనికుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు... శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పలుకులివి. ఆదిత్య ఠాక్రేకు సీఎం అయ్యే లక్షణాలున్నాయ్... శివ సైనికుల అభిప్రాయమిది... మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాలన్నది శివసేన చిరకాల వాంఛ. సీఎం సీటులో తమవాడు కూర్చుంటే చూడాలని ఉద్ధవ్ ఠా క్రే తెగ ఆరాటపడుతున్నారు. శివసైనికులైతే సీఎం కుర్చీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఐతే, ఈ ఆశలపై కమలదళం నీళ్లు కుమ్మరించింది. ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, శివసేనకు షాక్ ఇచ్చారు. సీఎం సీటు విషయంలో సేన కోరికను మొగ్గలోనే తుంచేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటును వేరే పార్టీకి అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవిసే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావే లేదన్నారు. శివసేన డిమాండ్‌లో తప్పేమీ లేదన్న షా, సీఎం కుర్చీని మాత్రం ఆ పార్టీకి ఇవ్వబోమన్నారు. ముఖ్యమంత్రి పీఠం విషయంలో రెండు పార్టీల నాయ కులు చేస్తున్న వ్యాఖ్యలతో పెద్దగా ఇబ్బంది ఉండబోదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మూడింట 2 వంతుల మెజార్టీ కైవసం చేసుకుంటుందని దీమాగా చెప్పారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 122 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఫలితాల అనంతరం మళ్లీ శివసేనతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా ఎన్నికల్లో రెండు పార్టీలు ముందుగానే సీట్లు పంచుకున్నాయి. పరస్పర అవగాహనతో బంపర్ మెజార్టీ లక్ష్యంగా పోరాడుతున్నాయి. ఐతే, సీఎం సీటు మాత్రం శివసేనకు దక్కే అవకాశం లేదు. డిప్యూటీ సీఎం పోస్టుతోనే శివసేన సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

Next Story