అచ్చెన్నాయుడు అరెస్టు ఏమో కానీ.. మీడియాకు మాత్రం పీడకలే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jun 2020 12:18 PM GMT
అచ్చెన్నాయుడు అరెస్టు ఏమో కానీ.. మీడియాకు మాత్రం పీడకలే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారం తాజాగా ఒక కొలిక్కి రావటం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున మొదలైన ఈ ఎపిసోడ్ శనివారం ఉదయానికి గుంటూరు ఆసుపత్రికి చేర్చటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏపీకి చెందిన మీడియా ప్రతినిధులకు చుక్కలంటే ప్రత్యక్షంగా కనిపించాయి. ఒక ఉదంతానికి సంబంధించి.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని నేపథ్యంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి.

మామూలు రోజుల్లో అయితే.. ఇలాంటి వ్యవహారాల్ని రిపోర్టు చేయటం.. దాన్ని ప్రజెంట్ చేయటం కాస్త ఇబ్బందే అయినా భరించలేనంత కష్టమైతే కాదు. కానీ.. ఇప్పుడు నడుస్తున్నది మహమ్మారి టైం. అలాంటి సమయంలో ఒక రోజు మొత్తం అదే అంశం మీద తిరగటం.. ఏ క్షణంలో ఏ పరిణామం చోటు చేసుకుంటుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం.. అలెర్టుగా ఉండటం మామూలు విషయం కాదు.

ఎంతో అవసరం అయితే తప్పించి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఎప్పుడు ఎక్కడ.. ఎలా ఉంటామో తెలీని అనిశ్చితిలో పని చేయటానికి మించిన తిప్పలు ఏముంటాయి. శ్రీకాకుళం జిల్లాలో మొదలైన అచ్చెన్నాయుడు వ్యవహారం విజయవాడ.. ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్ కావటంతో.. పలు జిల్లాలకు చెందిన రిపోర్టర్లతో పాటు.. మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు పగలు.. రాత్రి అనక తేడా లేకుండా పని చేయాల్సి వచ్చింది.

కరోనా రోగం ఏ మూల నుంచి విరుచుకుపడుతుందో తెలీని వేళలో.. రిపోర్టింగ్ చేయాల్సి రావటం పెద్ద సవాలు. అందునా ఇలాంటి రాజకీయ సంచలనాల అంశంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. శనివారం ఉదయం గుంటూరు ఆసుపత్రికి అచ్చెన్నను షిఫ్ట్ చేసిన తర్వాత మొదట ఊపిరి పీల్చుకున్నది మాత్రం మీడియా ప్రతినిధులేనని చెప్పక తప్పదు. అచ్చెన్నాయుడు అరెస్టు ఏమో కానీ.. మీడియా ప్రతినిధులకు మాత్రం పులుసు కారిందన్న మాట ప్రతి ఒక్కరి నోట వినిపించటం గమనార్హం.

Next Story
Share it