433కి కరోనా కేసులు.. భారత్‌లో ప్రమాద ఘంటికలు

By అంజి  Published on  23 March 2020 1:40 PM GMT
433కి కరోనా కేసులు.. భారత్‌లో ప్రమాద ఘంటికలు

ఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. భారత్‌లో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగానే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. కాగా దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు మన దేశంలో 433 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయిత కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 74, కేరళలో 67, కర్నాటక 33, యూపీ 31, గుజరాత్‌ 29, ఢిల్లీ 29, తెలంగాణ 32, హర్యానా 26, పంజాబ్‌ 21, రాజస్థాన్‌ 28, లడఖ్‌ 13, ఆంధ్రప్రదేశ్‌ 7, బిహార్‌ 2, ఛత్తీస్‌గఢ్‌ 1, హిమాచల్‌ప్రదేశ్‌ 2, మధ్య ప్రదేశ్‌ 6, ఒడిశా 2, పుదుఛ్చేరి 1, తమిళనాడు 9, జమ్ముకశ్మీర్‌ 4, చండీగఢ్‌ 6, ఉత్తరాఖండ్‌ 3, పశ్చిమబెంగాల్‌ 7 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ దేశంలో రెండవ దశలోనే ఉంది. కేవలం ఒక్కరోజు స్వీయ నిర్భంధంతో కరోనా బూచిని కట్టడి చేయలేమని గ్రహించిన కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.

కరోనాతో యుద్ధం జీవితకాల సవాల్‌ అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సరికొత్త, సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. జర్నలిస్టులు, కెమెరామెన్లు, టెక్నాలజీ నిపుణులు దేశానికి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారని అన్నారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని మీడియా తరిమికొట్టాలన్నారు. కరోనా మహహ్మరిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మీడియాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story