ఎన్నిక‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మృగాల్లో మార్పు రావ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల దళిత బాలికపై 10మంది కామాంధులు 6 నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

షోలాపూర్‌లోని ఓ గుడి ద‌గ్గ‌ర.. మంగ‌ళ‌వారం ఓ బాలిక ఏడుస్తూ కూర్చుంది. గ‌మ‌నించిన స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. వారు వ‌చ్చి విచారించ‌గా.. ఈ దారుణం వెలుగు చూసింది. షోలాపూర్‌కు చెందిన బాలిక(16) తల్లితో కలిసి ఉంటోంది. తండ్రి మృతి చెందగా.. బాలిక చిన్న చిన్న ప‌నులు చేస్తూ త‌ల్లికి సాయంగా ఉండేది. ఈ క్రమంలో ఆమెకు ఐదుగురు యువకులతో స్నేహం ఏర్పడింది.

6 నెలల క్రితం బాలిక స్నేహితులు ఐదుగురు ఆమె ఇంటికి వచ్చారు. మాయమాటలు చెప్పి.. ఓ నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లారు. వారితో పాటు మ‌రో 5గురు యువ‌కులు అక్క‌డ‌కు వ‌చ్చారు. మొత్తం 10మంది క‌లిసి బాలిక‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. విష‌యం బ‌య‌టికి చెబితే.. చంపుతామ‌ని బెదిరించారు. భ‌య‌ప‌డిన బాలిక విష‌యాన్ని ఎవ్వరికి చెప్ప‌లేదు. గ‌డిచిన ఆరు నెల‌ల్లో అనేక సార్లు ఆ కామాంధులు అత్యాచారానికి పాల్ప‌డారు.

తాజాగా.. మంగళవారం మ‌రోసారి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఓ గుడి ద‌గ్గ‌ర వ‌దిలివెళ్లారు. ఒంటరిగా ఏడుస్తున్న బాలికను గమనించిన స్థానికులు ఆమె దగ్గరకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నీరసంతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పదిమంది నిందితుల్లో ఐదుగురు బాలిక స్నేహితులే అని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేశామన్నారు. మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్