ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేసే ఆలోచన లేదు: కిషన్ రెడ్డి
  • ఇప్పటి వరకు దీనిపై చర్చే జరగలేదు: కిషన్ రెడ్డి
  • అంబేద్కర్ రెండో రాజధాని గురించి చెప్పలేదా?!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. దీంతో హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందని, అందుకోసం తెలంగాణ నుంచి హైదరాబాద్ ను వేరు చేస్తారని, కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారని కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.

అసలు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనేమీ లేదని, ఈ విషయంలో భాగస్వాములెవరినుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, ఆఖరికి కేంద్ర క్యాబినెట్ దీనిపై చర్చించనే లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రజలందరికీ త్రాగు నీరు కల్పించడం, వారికి విద్యుత్ సరఫరా చేయడం, సరైన ఆరోగ్య సేవలు అందించడం, రైతులకు ఆరువేల కోట్ల ఆర్థిక సాయం చేయడం వంటి అంశాలపైనే దృష్టిని కేంద్రీకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు.

పాకిస్తాన్ నుంచి రానున్న పెనుముప్పు దృష్యా, ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నందున, ఢిల్లీలోని కాలుష్యం దృష్ట్యా దక్షిణాదిన సుదూరంగా ఉన్న హైదరాబాద్ కు రాజధాని తరలించనున్నట్టు వదంతులు గత కొంత కాలంగా రాజ్యమేలుతున్నాయి. కొందరు బీజేపీ నేతలే ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడంలో ఈ వదంతులకు బలం చేకూరింది. మాజీ మహారాష్ట్ర గవర్నర్, సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర రావు ఇటీవలే ఈ విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఆయన అంబేద్కర్ హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలని ప్రతిపాదించారని కూడా చెప్పడంతో ఊహాగానాలు బయలుదేరాయి. అవన్నీ కేవలం ఊహాగానాలేనని, వాటికి ఎలాంటి ఆధారమూ లేదని కిషన్ రెడ్డి చెప్పక చెప్పేశారు. అంటే హైదరాబాద్ తెలంగాణకు ఒకటో రాజధానిగానే ఉంటుంది తప్ప ఢిల్లీకి రెండో రాజధానిగా ఉండదన్నమాట!!

అంబేద్కర్ చెప్పలేదా? ఊహాగానాలేనా..?!

గతంలో కూడా అంబేద్కర్ హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ప్రతిపాదించారనే వార్తలు ఉన్నాయి. దేశానికి రెండో రాజధానిగా ఉండే అర్హత హైదరాబాద్ కు ఉందనేది చాలా మంది అభిప్రాయం. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత సింఘ్వీ కూడా ట్విట్ చేశాడు. ఢిల్లీలో కాలుష్యం పెరిగింది..ప్రత్యామ్నాయ రాజధానిని ఆలోచించాలి అని. ఆయన అమరావతి, జార్ఖండ్ పేర్లు కూడా సూచించారు. దేశంలో కొన్ని స్టేట్ లకు రెండు రాజధానులు ఉన్నాయనేది వాస్తవం. ఇదే సూత్రాన్ని దేశానికి కూడా అమలు చేస్తే తప్పేంటీ అంటున్నారు కొంత మంది సామాజిక, రాజకీయ వేత్తలు.

దేశ రెండో రాజధానిగా ఉండటానికి హైదరాబాద్ కు చాలా అర్హతలు ఉన్నాయనే చెప్పాలి. శత్రుదేశాలకు దూరంగా ఉండటం. దేశానికి నడిబొడ్డున ఉండటం ప్లస్ పాయింట్. నార్త్, సౌత్ లను కలిపే బిడ్జిగా హైదరాబాద్ ఉంటుంది. అంతేకాదు..అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి.మంచి నీటికి కొరత ఉండదు. సో..పరిశీలించవచ్చు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story