హైదరాబాద్ న్యూస్‌|అరుదైన జంతువులను అమ్ముతున్న అన్నదమ్ములు.!

By Medi Samrat  Published on  17 Nov 2019 1:59 PM GMT
హైదరాబాద్ న్యూస్‌|అరుదైన జంతువులను అమ్ముతున్న అన్నదమ్ములు.!

హైదరాబాద్ న్యూస్‌ :

హైదరాబాద్ న్యూస్‌: “మందులోడా ఓరి మాయలోడా” అన్న పాటను ఆ అన్నదమ్ములు కాసింత సీరియస్ గానే తీసుకున్నారు. మెడికల్ షాపులో మందులమ్మితే వచ్చే ఆదాయం చాలకపోతే వాళ్లు ఏకంగా అరుదైన వన్యప్రాణుల వ్యాపారం చేసి బోల్డంత డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

అయితే అరుదైన జంతువులను అమ్మేస్తే డబ్బు వస్తుంది. కానీ దొరికిపోతే జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ సింపుల్ విషయాన్ని వాళ్లు మరిచిపోయారు.

హైదరాబాద్ పాతబస్తీ బార్కాస్ కి చెందిన సాలెహ్ బిన్న మహ్మద్ బదామ్, అలీ బిన్న మహ్మద్ బదామ్ అనే సోదరులు అరుదైన వన్యప్రాణులను పట్టుకుని తెచ్చి, వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తనమిత్రుడి దగ్గర తక్కువ ధరకు కొని, వాటిని ఎక్కువ ధరకు అమ్మి లాబాలు ఆర్జిస్తున్నారు. అయితే తొందర్లోనే వారి ఆట కట్టయింది. వారు వన్యప్రాణుల వ్యాపారంలో ఉన్న సంగతిని తెలుసుకున్న వన్యప్రాణి విభాగం, చాంద్రాయణగుట్ట పోలీసులు సాలెహ్ (55 ఏళ్లు) ను అరెస్టు చేశారు. అలీ బిన్ మహ్మద్ బదామ్ మాత్రం కాలికి బుద్ధి చెప్పి దొరక్కుండా తప్పించుకున్నాడు.

సాలెహ్ ను అరెస్టు చేసినప్పుడు అతని వద్ద నుంచి పోలీసులు నాలుగు స్లో లోరిస్ అనే వానర జాతి జంతువులను, భారతీయ నక్షత్ర తాబేళ్లను, మెత్తటి కవచం ఉన్న తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. లోరిస్ పేరుకు తగ్గట్టుగానే చాలా నెమ్మదిగా కదులుతుంది. పైగా ఇది రాత్రి మాత్రమే తిరుగుతుంది. ఇదొక అంతరించిపోతున్న వానర జాతి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ దీనిని అంతరించిపోతున్న అరుదైన జంతువుల జాబితాలో చేర్చింది. అలాగే భారత ప్రభుత్వ వన్యప్రాణి చట్టం 1971 మేరకు ఈ జంతువును వేటాడటం, చంపడం, బంధించడం నేరం. ఈ జంతువు శరీర భాగాలను మందులుగా ఉపయోగిస్తారు. అందుకే దీనికి ఇంత డిమాండ్ ఉంది.

నక్షత్ర తాబేళ్లు చాలా ఆకర్ణణీయంగా ఉంటాయి. వీటిని వేటాడటం, చంపడం కూడా నేరమే. ఇవి ప్రదానంగా ఒడిశాలోని మహానదిలో దొరుకుతాయి. ఇవి కూడా చాలా అరుదైన ఉభయ చరాలు. ఇక సాఫ్ట్ బ్యాక్ తాబేళ్లు చాలా ఎక్కువ కాలం నీటిలో ఉండగలవు. ముఖంతో శ్వాస పీల్చుకోవడం వల్ల అవి ఇలా చేయగలుగుతాయి. అందుకే ఇవి కూడా చాలా అరుదైన జంతువులుగా పరిగణించడం జరుగుతుంది. నోటిని విచిత్రంగా కదిలిస్తూ ఇవి ఊపిరి పీల్చుకుంటాయి. ఒక క్రమ పద్ధతిలో నోటిని కదిలించడం జరుగుతుంది.

పోలీసుల దాడిలో సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్ దొరికిపోయాడు. కానీ అలీ బిన్ ఇంకా దొరకలేదు. అతడిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.

Next Story