హైదరాబాదీల కొత్త ట్రెండ్– పెళ్లంటే పందిళ్లు, బాజాలు, బాకాలు, తప్పెట్లు, తలంబ్రాలు మాత్రమే కాదండోయ్. కొత్తదనాన్ని నిత్యం కోరుకునే కొత్తతరానికి పెళ్లంటే మరిచిపోలేని మరేదో కూడా ఉండాలి. పెళ్లి ఓ రేంజ్ లో జరగాలి. పది మందీ దాని గురించి మాట్లాడుకోవాలి. ఆ పెళ్లి విశేషాలు పత్రికలకెక్కాలి. ప్రజల నోళ్లలో నానాలి. వరుడు పారాచూట్ సాయంతో దిగడమో, పడవలో సముద్రం నడిమధ్యన “మాంగల్యం తంతునా” అనడమో … ఇలా ఏదో స్పెషాలిటీ ఉండాలి.

ఇప్పుడు తాజాగా పెళ్లిళ్ల రంగంలో కొత్తగా వినిపిస్తున్న పేరు డెస్టినేషన్ వెడ్డింగ్. అబ్బురపరిచే అందాల ఫారిన్ లోకేషన్లలో అద్భుత కాల్పనిక వాతావరణంలో అంగరంగవైభోగంగా పెళ్లాడటమే ఇప్పటి కొత్త ట్రెండ్. అందాల దీపికా పదుకోన్ అతిశయాల రణవీర్ సింగ్ ను పెళ్లాడింది డిస్టెనేషన్ వెడ్డింగ్ లోనే. మన సమాంతా, నాగచైతన్యలు, బెంగాలీ నటి-ఎంపీ సున్రత్ జహాన్, ఆమె భర్త నిఖిల్ జైన్, రాజమౌళి కొడుకు, వెంకటేశ్ కూతురు, అందాల భామ ప్రియాంకా చోప్రా, ఆమె కుర్ర భర్త నిక్ జోనాస్ లందరివీ డిస్టినేషన్ వెడ్డింగ్ లే. ఆఖరికి మారు వివాహానికి సిద్ధమౌతున్న మలైకా అరోరా కూడా ఓ అందమైన విదేశీ బీచ్ లో పెళ్లాడతానని ప్రకటించేశారు.

ఇప్పుడు కాసిన్ని కాసులున్నవారు, ప్రపంచమంతా కలయతిరిగేవారు, కొత్త ఊహలు, కొత్త కోర్కెలు ఉన్న వారు చాలా మంది ఇలాంటి డిస్టినేషన్ వెడ్డింగ్ లను కోరుకుటున్నారు. కేటలాగులు తెరిచి మరీ కొత్త కొత్త లొకేషన్లను వెతుక్కుంటున్నారు. మన హైదరాబాదీ పెళ్లి కొడుకులూ, పెళ్లి కూతుళ్లూ కూడా ఇందులో ఏ మాత్రం తక్కువ తిన లేదు. (హైదరాబాదీల కొత్త ట్రెండ్) హైదరాబాదీ పారిశ్రామికవేత్త సతీశ్ రెడ్డి తన కుమారుడి వివాహం ఒమాన్ లో చేశారు. ఎంపీ సీ ఎం రమేశ్ తన కుమారుడు ఋత్విక్ వివాహాన్ని దుబాయిలో జరపబోతున్నారు. ఆర్కిటెక్ట్ సుప్రియా రెడ్డి కూడా తన కుమారుడిని లాంగ్ కావ్ లో జరపబోతున్నారు.

ఇలా సుదూర వివాహ వేదికలను ఎంచుకోవడానికి బోలెడు కారణాలున్నాయి. కొత్త బంగారు లోకంలోకి అడుగుపెట్టే క్షణాలు కలకాలం గుర్తుండిపోవాలన్న తపన ఒక కారణమైతే, అనవసర అతిథులు, తొక్కిసలాటలు లేకుండా, ఆత్మీయులు మాత్రమే ఉండేలా చూసుకోవడం రెండో కారణం. కోరుకున్న కొద్ది మంది మాత్రమే పెళ్లికి హాజరవుతారు. దీనితో ఆత్మీయ క్షణాలలో ఆత్మీయులు మాత్రమే ఉండి, అనవసర హడావిడి లేకుండా చూసుకోవచ్చు. సోనమ్ కపూర్ వంటి వారు తమ వివాహాన్ని ఉదయ్ పూర్ రాజభవనంలో జరుపుకున్నారు. అందకుండా ఉంటూనే అందరినీ రప్పించేలాంటి లోకేషన్ ను ఎంచుకున్నారు.

సొంతింట్లో కాక సుదూర ప్రదేశాల్లో వివాహం చేసుకోవడం వల్ల ఆత్మీయులతో కలిసి కాలం గడిపే అవకాశం కూడా వస్తుంది. బిజీ రొటీన్ కు భిన్నమైన వాతావరణం దొరుకుతుంది. సో… కాసులుంటే చాలు…. కళ్యాణం ఎక్కడైనా చేసుకోవచ్చు. కలకాలం గుర్తుండిపోయేలా వేడుకలు చేసుకోవచ్చు. సో…. హైదరాబాదీ గాళ్స్ అండ్ గైస్…. మీరెక్కడ పెళ్లాడబోతున్నారు? . అందమైన కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి..మీరు కూడా కలకాలం గుర్తుండే కల్యాణం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.