వారే నా గురువులు... అనంతపురం 100వ కలెక్టర్
Published on 2 Dec 2019 3:44 PM GMT
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తనకు నడక నేర్పిన తండ్రి వెంకటన్న, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పుల్లయ్యలు సాక్షిగా అనంతపురం జిల్లాకు 100వ కలెక్టర్ గా గంధపు చంద్రుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అనంతపురం కలెక్టరేట్ కార్యాలయానికి కొత్త కలెక్టర్ వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ మెట్ల ప్రాంగణానికి నమస్కారం చేసి, తన కార్యాలయంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తన తండ్రి వెంకటన్న, చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువు పుల్లయ్యల ఆశీర్వాదం తీసుకుని ,ఆ తరువాత కలెక్టర్ సత్యనారాయణ నుంచి అనంతపురం జిల్లాకు 100వ కలెక్టర్ గా గంధపు చంద్రుడు సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ ఢిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ నిశాంతి, ట్రైనీ కలెక్టర్ జాహ్నవి, ఇతర జిల్లా అధికారులు పుష్పగుచాలిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ వెంట తన ఇద్దరు కుమారులు సిద్దార్థ్ జై, భువన్ జైలు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు పుల్లయ్య శిక్షణ ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ జిల్లా ఏర్పడినప్పటి నుంచి తాను 100వ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ బాటలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.