భార్య కాళ్లు, చేతుల‌ను న‌రికేసిన భ‌ర్త‌...ఎందుకో తెలుసా..?

By Newsmeter.Network  Published on  24 Nov 2019 7:33 AM GMT
భార్య కాళ్లు, చేతుల‌ను న‌రికేసిన భ‌ర్త‌...ఎందుకో తెలుసా..?

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త ఆమె కాళ్ల‌ను న‌రికేసి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. జిల్లాలోని ఆరుమాకుల‌ప‌ల్లిలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబీకులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... గ్రామానికి చెందిన సతీష్‌కు నాగమ్మ అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వివాహం అయిన కొద్దిరోజుల నుంచే సతీశ్ భార్యపై అనుమంన పెంచుకున్నాడు. ఆమె ఎక్క‌డికి వెళ్లినా, ఎవ‌రితో మాట్లాడినా అనుమానించి గొడ‌వ‌కు దిగేవాడు. ఇలా వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు అధిక‌మ‌య్యాయి. చివ‌ర‌కు పెద్దల మధ్య పంచాయతీ జ‌రిగి వారిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదుర్చినా ఫ‌లితం లేకుండా పోయింది.

ఈ క్రమంలో ఆదివారం సతీశ్‌ భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో, కోపోద్రిక్తుడైన భ‌ర్త‌ కత్తితో భార్య కాళ్లు, చేతులు నరికేశాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించి ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం నాగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆమె భ‌ర్త‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story
Share it