ప్రపంచ నియంతలను మించిపోయిన పెద్ద నియంత కేసీఆర్‌- పొన్నాల

By Newsmeter.Network  Published on  7 Oct 2019 1:45 PM GMT
ప్రపంచ నియంతలను మించిపోయిన పెద్ద నియంత కేసీఆర్‌- పొన్నాల

హైదరాబాద్‌: కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి చేసిన ప్రకటన మీద మాట్లాడటానికి సిగ్గు పడుతున్నా అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ప్రజాస్వామ్యవాదిగా తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచంలో నియంతలనే మించిపోయిన నియంత కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నాల. 48వేల మంది కార్మికులను ఒకేసారి తొలగిస్తున్నామన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. 35రోజుల క్రితం చర్చల కోసం నోటీసిస్తే..మూడు రోజుల ముందు కమిటీ వేసి మమ అనిపించారన్నారు. వేల కోట్లు ఆస్తులున్న రవాణా సంస్థను ప్రైవేటికరించేందుకు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులను కొట్టేయడానికి దుర్మార్గమైన చర్యలు చేపడుతున్నారని వీడియోలో పొన్నాల దుయ్యబట్టారు.

తెలంగాణ పోరులో యాభైవేల ఆర్టీసీ కార్మికులను భాగస్వామ్యం చేశారన్నారు పొన్నాల. సకలజనుల సమ్మెలో బజారుకీడ్చి ఈరోజేమో సమ్మె చేస్తే ఉద్యోగాలు తీస్తామంటారా ? ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు పొన్నాల. లక్ష ఉద్యోగాలిస్తామని.. ఇంటికో ఉద్యోగమిస్తామని...గద్దెనెక్కి ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలు తీసేస్తారా అంటూ మండిపడ్డారు.

బ్రిటీష్,మొఘల్‌లు ఈదేశాన్ని పాలించారు.ఎనిమిది వందల సంవత్సరాల పరాయి పాలనలో కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. ప్రజలను అష్టకష్టాలు పాల్జేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వమన్నారు పొన్నాల.

Next Story
Share it