తాగునీటి నాణ్యత : ఢిల్లీ అధ్వాన్నం.. ముంబాయి అత్యుత్తమం.. ఆ తరువాత మన హైదరాబాదే.!

ముఖ్యాంశాలు(తాగునీటి నాణ్యత)

  • కాలుష్య రాజధానిగా ఢిల్లీ
  • ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సర్వే
  • రెండో స్థానంలో హైదరాబాద్

ఇప్పటికే ఢిల్లీ ప్రపంచ కాలుష్య రాజధానిగా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఈ మూలిగే నక్కపై ఇప్పుడు మరో తాటికాయ పడింది. అదేమిటంటే ఢిల్లీ త్రాగు నీరు త్రాగడానికే పనికిరాదట. అంత మురికి, కాలుష్యం, బాక్టీరియా, వైరస్ ఆ నీటిలో ఉంటుందట. మన దేశంలోని 21 రాష్ట్రాల రాజధానులపై చేసిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వేను ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థ నిర్వహించింది. తాగునీటి  నాణ్యతపై ఈ అధ్యయనం జరిగింది. నీటిలో ఉన్న ఘనపదార్థాలు, నీటి స్పష్టత, ఆమ్ల క్షారాల శాతం, రసాయన పదార్థాల శాతం, నీటి సాంపిల్ లో ఈ కోలై వంటి బాక్టీరియాల శాతం వంటి పదకొండు అంశాల ఆధారంగా నీటి నాణ్యతను నిర్ధారించడం జరుగుతుంది.

ఈ ఇరవై ఒక్క నగరాల్లో 13 నగరాల్లో నీటి నాణ్యత అస్సలు బాగోలేదు. ఈ జాబితాలో మన మహానగరాలైన కోల్ కతా, చెన్నై, బెంగుళూరు, జైపూర్, లక్నోలు కూడా ఉన్నాయి. చండీగఢ్, గాంధీ నగర్ , జమ్మూ నగరాల త్రాగునీటి నాణ్యత కూడా అంతంత మాత్రమేనట. నిజానికి మంచి నాణ్యత ఉన్న నీరు కేవలం ముంబాయిలోనే అందుబాటులో ఉందట. అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ 10500:2012 ప్రమాణ పరీక్షల్లోనూ ముంబాయే టాప్ అట. అంటే ఒక్క ముంబాయిలోనే మంచి నీరు నిజంగా “మంచి” నీరన్న మాట. ముంబాయి తరువాత రెండో స్థానంలో మన హైదరాబాద్ నగరమే ఉంది. మన హైదరాబాద్ నుంచి పంపిన నీటి సాంపిల్స్ లో ఒకే ఒక్క సాంపిల్ మాత్రమే ప్రమాణాలకు సరితూగలేదు. మిగతావన్నీ బాగున్నాయి.

నగరాల్లో నాణ్యమైన తాగు నీరు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జల జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి దేశంలో అన్ని కుటుంబాలకు నాణ్యమైన నీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 3.5 లక్షల కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్టు ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. జలవనరుల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచబోతున్నట్టు చెప్పారు.

ఈ అధ్యయనాన్ని కేంద్ర ఆహార, వినియోగదారుల మంత్రిత్వ శాఖ కోసం నిర్వహించడం జరిగింది. పైపుల ద్వారా, కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా అయ్యే నగరాల్లోనూ నీరు త్రాగేందుకు యోగ్యమైనది కాదని ఈ అద్యయనం తేటతెల్లం చేసింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.