హైదరాబాద్: హైదరాబాద్ పేరుకే మహానగరం. పేరుకే విశ్వనగరం. పేరుకే అన్ని అవకాశాలకు హరివిల్లు. కాని..హైదరాబాద్ లో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. పరిశ్రమలు విడుదల చేస్తున్న రసాయనాలు హైదరాబాద్ నాడినే దెబ్బ తీస్తున్నాయి. గాలిలో విషం. తాగే మంచి నీటిలో విషం. ఇలా అయితే..హైదరాబాద్ జీవనాడి, భవిష్యత్తు ప్రమాదకరమనే చెప్పాలి. ముఖ్యంగా..హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో కాలుష్యం పడగ విప్పి నాట్యం చేస్తుంది. పారిశ్రామిక చట్టలు పకడ్బందీగా లేకపోవడంతో రసాయనాలు ఇష్టం వచ్చినట్లు వదిలేస్తున్నారు. పర్యావరణ  చట్టాలు పట్టించుకునే వారు లేకపోవడంతో గాలిని విషతుల్యం చేస్తున్నారు. ఇలా అయితే..హైదరాబాదీలు ఎలా బతకాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కూకట్ పల్లిలోని ధరణి నగర్ పేరు చాలా బాగుంది. ‘ధరణి’అంటే భూమి. అక్కడ భూగర్భ జలాల్లో విషం ఉంది. అక్కడి గాలిలో కాలుష్యం ఉంది.

హైదరాబాద్ లో  నాలాల దగ్గర నుంచి పోతుంటేనే ముక్కు మూసుకుని పోతుంటాం. అదే నాలా నీళ్లు రోడ్డెక్కితే. అవి పరిశ్రమలు  వదిలిన రసాయనాలు మిక్స్ అయి ఉంటే..ఎంత ప్రమాదకరం?!. అంతుబట్టని చర్మ వ్యాధులు వస్తాయి. ఆ గాలిని పీలిస్తే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.అయినా.. ప్రభుత్వానికి, అధికారులకు పట్టడం లేదు. ముఖ్యంగా కూకట్ పల్లి, జీడిమెట్ల, షాపూర్, పటాన్ చెరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా విషతుల్యం అయ్యాయి. మూసీ నదిని హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించే  ‘పాయిజన్ రివర్ ‘గా అభివర్ణించవచ్చు. ఇంత విషాన్ని మనం పీల్చేగాలిలో పెట్టుకుని ఎలా బతకాలి..?. అంతేకాదు..రసాయనాలు కలిసిన నీటితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. అవి తాగిన వారికి ఎముకల వ్యాధితోపాటు మరికొన్ని వ్యాధులు వచ్చే అవకాశముంది.

ఈ వీడియోలో ఉన్న నీటిని  చూడండి. చూస్తుంటేనే భయమేస్తుంది. ఇది హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియా. ఈ మధ్య వానలు బాగా పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కూకట్ పల్లిలోని నాలా పొంగిపొర్లి రోడ్లు, వీధుల్లోకి వచ్చిన నీరు ఇది. ఆ నీటి మీద తేలాడున్న స్నోను చూడండి. మురికి నీరు పైగా రసాయనాలు కలిసింది. రోడ్ల మీద ప్రవహిస్తుంది. దీనిలో నడిస్తే అంతే సంగతులు. నడవక తప్పదు. అంటే..మనకై మనం వ్యాధులను ఆహ్వానించడం అన్న మాట.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా పరిశ్రమలు విడుదల చేసే రసాయనాల మీద దృష్టి పెట్టాలి.  వాటిని నాలాల్లో కలవనీయకుండా  నిబంధనలు తయారు చేసి..వాటిని కఠినంగా అమలు చేయాలి. పర్యావరణ చట్టాలకు పదును పెట్టి పరిశ్రమల దూకుడును కట్టడి చేయాలి. అప్పుడే..చుట్టూ మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్వచ్ఛమైన హైదరాబాద్ ను భావితరాలకు అందించాలంటే..భవిష్యత్తులో ఈ వీడియోలో చూసిన దృశ్యాలు లేకుండా చేయాలి.

ప్రపంచంలోనే  చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ లాంటి నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. “మన నగరం – మన భవిష్యత్తు “పేరుతో ఉద్యమించాలి. అప్పుడే..కాలుష్య కోరల నుంచి హైదరాబాద్ ను కాపాడుకోగలం.

 

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.