ఇండియా కాలుష్య రికార్డుః టాప్ టెన్ లో మూడు నగరాలు మనవే..!

ఇండియా కాలుష్య రికార్డుః మన ఢిల్లీ మరో “గొప్ప” రికార్డును దక్కించుకుందోచ్…. అవునండీ. అధ్వాన్న వాయు కాలుష్యంలో మనదే ప్రపంచ రికార్డు. ప్రపంచంలోనే అత్యధిక వాయుకాలుష్యం ఉన్న నగరంగా మన దేశ రాజధాని ప్రపంచ కాలుష్య రాజధానిగా ఎదిగింది.వాతావరణ సూచనలు ఇచ్చేసంస్థ స్కైమెట్ తాజాగా జారీ చేసిన నివేదిక ప్రకారం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (వాయు కాలుష్య సూచి) శుక్రవారం ఉదయం 500 పాయింట్లకు చేరింది. మధ్యాహ్నానికి 550 కి చేరింది. దట్టమైన పొగమంచు, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాలు, ఉత్తరాది నుంచి వచ్చే కాలిన పంటపొలాల పొగ కలగలిసి ఢిల్లీని కాలుష్య కాసారంగా మార్చేశాయి.

నవంబర్ 5 నుంచి వరుసగా తొమ్మిది రోజుల పాటు వాతావరణ కాలుష్యం ఏకబిగిన ఢిల్లీని కాలుష్య చెరలో బంధించింది. ఇంత కాలం పాటు ఒక నగరం ఇలా వాయు కాలుష్యపు భల్లూకపు పట్టులో ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి. అధికారికంగా ఇప్పుడు ఢిల్లీ అత్యంత కలుషిత నగరం దీని తరువాత స్థానంలో 234 పాయింట్లతో లాహోర్, 185 పాయింట్లతో తాష్కెంట్ లు ఉన్నాయి.

ఇండియా కాలుష్య రికార్డు రోజురోజుకు పెరుగుతోంది. విషాదం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత కలుషితమైన పది నగరాల్లో ఆరు భారత దేశం, దాని చుట్టు పక్కలే ఉన్నాయి. ఢిల్లీ, లాహోర్, కరాచీ, ముంబాయి, కోల్ కతా, కాఠ్ మండూలు ఈ జాబితాలో ఉన్నాయని స్కైమెట్ తెలిపింది.

కోల్ కతా అయిదో స్థానంలో, ఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. నేపాల్ రాజధాని కాఠ్మండూ పదో స్థానంలో ఉంది. ఢిల్లీ రికార్డును ఇప్పట్లో ఏ నగరమూ బద్దలు కొట్టే పరిస్థితి లేదు. ఢిల్లీ కాలుష్యానికి ముఖ్యమంత్రి సరి బేసి విధానంతో మందు వేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ, అది ఏ మేరకు ఫలితం ఇస్తుందన్నది ప్రశ్నార్థకమే. నవంబర్ 4 నుంచి 14 వరకూ ఇది అమలైంది.

ఇప్పుడు దీన్ని పొడిగించే సూచనలే కానవస్తున్నాయి. సరి బేసి సంఖ్య అంటే ఒక రోజు సరి సంఖ్య రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్న కార్లే రోడ్డు మీదకి రావాలి. మరుసటి రోజు బేసి సంఖ్య ఉన్నకార్లను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు. ఇలా చేయడం వల్ల రోడ్డు మీదకు వచ్చే కార్ల సంఖ్య సగానికి తగ్గుతుంది. అయితే ఈ ప్రయత్నం కూడా పెద్దగా ఫలితాలను ఇచ్చినట్టు కనిపించడం లేదు.

అయితే..కాలుష్యం అనేది ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసురుతుంది. ఈ సవాల్ ఏ ఒక్కరి సవాల్ కాదు. ప్రపంచ ప్రజలు ,  నాయకత్వానికి విసురుతున్న సవాల్. కాలుష్యం నుంచి నగరాలను కాపాడుకుంటేనే సిటీలు బతికుతాయి. ప్రజల ఆరోగ్యంగా ఉంటారు. కాలుష్య కోరలు విరచకపోతే…కోట్లాది ప్రజలను పొల్యూషన్ డెవిల్ కాటు వేయడం కాయం. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితే కాదు..ప్రపంచ పాలకులు గుర్తించాలి. కెనడా పాప యూఎన్ఓలో ప్రశ్నించినట్లు..ఒకరు భవిష్యత్తును నాశనం చేసే అధికారం మరొకరికి లేదు. ఈ విషయాన్ని పాలకులు గుర్తెరగాలి. నగరాలనే కాదు..భూమండలాన్ని పర్యావరణహితంగా మార్చాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.