ఆ లేఖ అబద్ధం:పాకిస్తాన్ కి చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, బంగ్లాదేశ్ కు చెందిన కొన్ని మీడియా ఛానల్స్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ కి రాసిన లేఖంటూ ఒక లేఖను విస్తృతంగా ప్రచారం, ప్రసారం చేస్తున్నాయి. భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు చేయడం ఈ లేఖలో ప్రధానాంశం.

నిజనిర్ధారణ :

కీలక సమయంలో సుప్రీం సమున్నత ధర్మాసనం సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ కి అధికారికంగా తన లెటర్ ప్యాడ్ మీద లేఖ రాసినట్టుగా చూపిస్తున్న ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని అనుకూలంగా తీర్పును వెలువరించినందుకుగాను హిందువులందరూ మీకు ఋణపడి ఉన్నారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ లేఖలో రంజన్ గొగోయ్ కి కృతజ్ఞతలు తెలపడం సారాంశం.

View image on Twitter

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఈ ప్రచారాన్ని నిర్ద్వంద్వంగా ఖండిచారు. పూర్తిగా ఇది అబద్ధపు విష ప్రచారమని, మతాలు, జాతులమధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకే ఈ పని చేస్తున్నారని, ముఖ్యంగా భారత్ తో బంగ్లాదేశ్ కి ఉన్న సంబంధాలను నష్టపరచడమే ఈ లేఖ ఉద్దేశంగా కనపడుతోందని చెబుతూ అధికార ప్రతినిధి సదరు లేఖను, అందులో ఉన్న అంశాలను పూర్తిగా ఖండించారు.ఢాకాలోని భారతీయ దౌత్య కార్యాలయంకూడా ఈ లేఖను అబద్ధపు లేఖగా, అబద్ధపు ప్రచారంగా ప్రకటించింది. దీన్ని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని, మత విద్వేషాలను, దేశాలమధ్య సంబంధాలను చెడగొట్టడానికి పనిగట్టుకుని ఎవరో ఈ లేఖను ప్రచారం చేస్తున్నారని భారతీయ దౌత్య కార్యాలయం అధికారులు తెలిపారు.దీన్నిబట్టి చూస్తే అయోధ్య తీర్పు విషయంలో సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ లేఖ రాయడంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా పచ్చి అబద్ధపు ప్రచారమే తప్ప అందులో అణుమాత్రమైనా నిజం లేదు. ఆ లేఖ అబద్దం.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story