బ్రేకింగ్: సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత
By సుభాష్ Published on 8 Sept 2020 8:18 AM ISTతెలుగు సినిమాల్లో విలక్షణ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోని కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లను నిలిచిపోవడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.
కాగా, జయప్రకాశ్ రెడ్డి 1946 మే 8వ తేదీన జన్మించారు. సొంతూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం శిరివెళ్ళ. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పని చేసిన జయప్రకాశ్‌రెడ్డి.. 1988 లో విడుదలైన బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పలు నాటకాల్లో ఆయన నటించారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, బిందాస్, ఛత్రపతి, గబ్బర్‌సింగ్, నాయక్, బాద్షా, రేసు గుర్రం, సరైనోడు, పటాస్, మనం, రెడీ, ఖైదీనంబర్ 150, జై సింహా, రాజా ది గ్రేట్ వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరులో కనిపించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. తన రాయలసీమ యాస, యాష భాషతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఎన్నో రకాల పాత్రలు పోషించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ప్రతినాయకుడిగా పాత్రలో నటించి, హస్యనటుడిగా అలరించి ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. యువ నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత వయసు మీద పడినా కుర్ర హీరోలకు ధీటుగా ఆయన నటన సాగించారు. బాలకృష్ణతో కలిసి ప్రతినాయకుని పాత్రలో జయప్రకాశ్ చేసే నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.